Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
షేర్లలో సంపన్నుల పెట్టుబడులు రూ.10 లక్షల కోట్లు.. HDFC, రిలయన్స్, టైటాన్‌, ఇన్ఫోసిస్ షేర్లకు ప్రయారిటీ

షేర్లలో సంపన్నుల పెట్టుబడులు రూ.10 లక్షల కోట్లు.. HDFC, రిలయన్స్, టైటాన్‌, ఇన్ఫోసిస్ షేర్లకు ప్రయారిటీ

V6 Velugu 2 weeks ago
  • జూన్ క్వార్టర్‌లో రూ.1.83 లక్షల కోట్లు పెరిగిన హెచ్‌ఎన్‌ఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
  • ఎన్‌ఎస్‌ఈలోని
  • మొత్తం 2,340 కంపెనీల్లో
  • 2,284 కంపెనీలలో పెట్టుబడి
  • హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్, టైటాన్‌, ఇన్ఫోసిస్ షేర్లకు ప్రయారిటీ

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలో హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ -(హెచ్‌ఎన్‌ఐ) సరికొత్త రికార్డు సృష్టించారు. కేవలం మూడు నెలల్లోనే లిస్టెడ్ కంపెనీల్లో రూ.1.83 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దీంతో వీరి మొత్తం ఈక్విటీ హోల్డింగ్ విలువ దాదాపు రూ.10 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ రీసెర్చ్‌ కంపెనీ ప్రైమ్ డేటాబేస్ రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్ క్వార్టర్‌ ముగిసే నాటికి హెచ్ఎన్ఐల మొత్తం ఈక్విటీ విలువ క్వార్టర్లీ ప్రాతిపదికన 22.55శాతం పెరిగి రూ.9.92 లక్షల కోట్లుగా నమోదైంది. మార్చి క్వార్టర్‌ ముగిసే నాటికి ఇది రూ.8.10 లక్షల కోట్లుగా ఉంది. 2025 డిసెంబర్‌లో నమోదైన రూ.9.56 లక్షల కోట్ల రికార్డును తాజాగా అధిగమించింది.

పడిన షేర్లలోనూ భారీ కొనుగోళ్లు

ఇన్ఫోసిస్ షేరు జూన్ క్వార్టర్‌లో 20శాతం పతనమైనప్పటికీ హెచ్ఎన్ఐలు రూ.2,859 కోట్ల విలువైన 2.44 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. స్విగ్గీ షేరు 8 శాతం పడిపోయినా రూ.825 కోట్ల విలువైన షేర్లను దక్కించుకున్నారు. గోద్రెజ్ కన్స్యూమర్ (రూ.1,611 కోట్లు), టొరెంట్ ఫార్మా (రూ.1,370 కోట్లు), సుజ్లాన్ ఎనర్జీ (రూ.977 కోట్లు)లలోనూ భారీ కొనుగోళ్లు జరిగాయి. మరోవైపు వారీ ఎనర్జీస్‌లో రూ.2,031 కోట్ల విలువైన నికర అమ్మకాలు జరిగాయి. ఎస్‌జీ మార్ట్ (రూ.1,284 కోట్లు), విప్రో (రూ.568 కోట్లు), బీఎస్‌ఈ (రూ.567 కోట్లు)లలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది.

వొడాఫోన్ ఐడియా 70శాతం ర్యాలీ చేశాక దాదాపు రూ.456 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. ఎన్‌ఎస్‌ఈలోని మొత్తం 2,340 కంపెనీల్లో 2,284 కంపెనీలలో హెచ్ఎన్ఐలు పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా రూ.1,300 కోట్ల లోపు మార్కెట్ క్యాప్ ఉన్న గ్రేడియంట్ ఇన్ఫోటైన్‌మెంట్ (63.47శాతం), యునివా ఫుడ్స్ (59.30శాతం) వంటి చిన్న కంపెనీల్లో వీరి వాటా అధికంగా ఉంది. భారత స్టాక్ మార్కెట్ విలువలో విదేశీ ఇన్వెస్టర్ల వాటా 14 ఏళ్ల కనిష్టమైన 15.88శాతంకి పడిపోగా, డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, రిటైలర్లు, హెచ్ఎన్ఐల ఉమ్మడి దేశీయ వాటా 28.66శాతానికి చేరి ఆల్-టైమ్ రికార్డును నమోదు చేసింది. మిగిలిన వాటా ప్రమోటర్లు, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వాల చేతుల్లో ఉంది.

టాప్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

హెచ్ఎన్ఐల ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో రూ.28,972 కోట్ల వాల్యూతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ టాప్‌లో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (రూ.24,383 కోట్లు), టైటాన్ కంపెనీ (రూ.23,744 కోట్లు), ఇన్ఫోసిస్ (రూ.17,251 కోట్లు), కోటక్ మహీంద్రా బ్యాంక్ (రూ.15,512 కోట్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బీఎస్‌ఈ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సుజ్లాన్ ఎనర్జీ, బజాజ్ ఫైనాన్స్, వొడాఫోన్ ఐడియాలతో కలిపి టాప్-10 షేర్ల విలువ రూ.1.68 లక్షల కోట్లకు, మొత్తం హెచ్ఎన్ఐ హోల్డింగ్స్‌లో 17శాతానికి చేరింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News