- ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు
- ఐదింటిని ధ్వంసం చేసిన యూఎస్
- జోర్డాన్‌లోని అమెరికా బేస్‌పైకి ఇరాన్ మిసైల్స్
టెహ్రాన్/వాషింగ్టన్: హార్మూజ్ జలసంధి, గల్ఫ్ఆఫ్ ఒమన్‌లో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ దాడులు ఉధృతం అయ్యాయి.
మంగళవారం హార్మూజ్‌లో అమెరికా నేవీ షిప్పులపై ఇరాన్ దాడులు చేయగా.. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఇరాన్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్లపై యూఎస్ బలగాలు అటాక్స్ చేశాయి. జోర్డాన్‌లోని యూఎస్ బేస్‌పైనా ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించింది. అమెరికాకు చెందిన మొత్తం 10 షిప్పులపై ఇరాన్ దాడులకు యత్నించగా.. ఇరాన్‌కు చెందిన 5 ఆయిల్ ట్యాంకర్లను అమెరికా నేవీ ధ్వంసం చేసింది.
ధ్వంసమైన ఇరానియన్ ట్యాంకర్లలో కివిక్, చార్మినార్, హొరిజన్ 1, రిస్కో ఉన్నాయి. హార్మూజ్ జలసంధిలోని ఖర్గ్ ద్వీపం సమీపంలో ఉన్న దెరియా నౌకను కూడా అమెరికా సైన్యం ధ్వంసం చేసింది. అమెరికా దాడుల తర్వాత, తమ భూభాగం వైపు ప్రయోగించిన 18 బాలిస్టిక్ క్షిపణులను వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని జోర్డాన్ సైన్యం తెలిపింది.
మరో రెండు క్షిపణులు జనావాసాలు లేని చోట పడ్డాయని పేర్కొంది. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. అంతకుముందు, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో అమెరికా విమానవాహక నౌక, డిస్ట్రాయర్‌పై దాడి చేయడానికి ప్రయత్నించిన తర్వాత శనివారం నాడు అమెరికా బలగాలు 3 ఇరానియన్ చమురు ట్యాంకర్లను ధ్వంసం చేశాయి.
ఇరాన్ చేతికి అమెరికా సబ్‌మెర్సిబుల్ డ్రోన్
హార్మూజ్ జలసంధి ప్రవేశ ద్వారం వద్ద అమెరికా సైన్యానికి చెందిన లేటెస్ట్ సబ్‌మెర్సిబుల్ డ్రోన్ 'డైవ్ ఎల్డీ'ని స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ నావికాదళం ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక సబ్‌సర్ఫేస్ వెహికల్ టెక్నాలజీతో ఈ డ్రోన్ తయారైందని, దీనిని ఒక సంక్లిష్ట ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ద్వారా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది.
హార్మూజ్ జలసంధిపై ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని ఐఆర్జీసీ మరో ప్రకటనలో పేర్కొంది. అయితే, తమ సబ్‌మెర్సిబుల్ డ్రోన్ ప్రాంతీయ జలాలపై నిఘా పెడుతున్న సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిందని అమెరికా సైన్యం తెలిపింది.

