Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తల్లి నగలు అమ్మి కాలేజీలో చదివించారు.. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ టెక్కీ జీతం రూ.2కోట్లు!

తల్లి నగలు అమ్మి కాలేజీలో చదివించారు.. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ టెక్కీ జీతం రూ.2కోట్లు!

V6 Velugu 2 weeks ago

జీవితంలో కొన్ని విజయాల వెనుక కేవలం ప్రతిభ మాత్రమే ఉండదు.. తల్లిదండ్రుల త్యాగాలు, కష్టాలు, నమ్మకం కూడా ఉంటాయి. బెంగళూరుకు చెందిన మైక్రోసాఫ్ట్ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మను అగర్వాల్ పంచుకున్న తన జీవిత ప్రయాణం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతోమందిని కదిలిస్తోంది.

ఒకప్పుడు కాలేజీ ఫీజు కోసం రూ.15 వేలు కూడా సమకూర్చుకోలేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన.. అదే కష్టాలను అధిగమించి మైక్రోసాఫ్ట్‌లో ఏడాదికి రూ.కోటి 90లక్షల జీతం అందుకునే స్థాయికి చేరుకున్నారు.

మను అగర్వాల్ తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. బీసీఏ చదివే రోజుల్లో ఒక సెమిస్టర్ ఫీజు రూ.15 వేలు చెల్లించడానికి కూడా కుటుంబం ఇబ్బంది పడిందని తెలిపారు. ఆ సమయంలో తన చదువు ఆగిపోకుండా కొనసాగించేందుకు తండ్రి తన తల్లి బంగారు నగలను అమ్మారని గుర్తు చేసుకున్నాడు. తల్లి తన గాజులను ఇచ్చేయటం తన మనసులో ఎప్పటికీ నిలిచిపోయిన సంఘటన అని మను పేర్కొన్నాడు.

మైక్రోసాఫ్ట్ సియాటిల్ కార్యాలయంలో పనిచేస్తూ మంచి స్థాయికి చేరుకున్న తర్వాత.. తన తల్లికి ఫోన్ చేసి మళ్లీ నగలు కొనుక్కోవచ్చని చెప్పానని గుర్తు చేసుకున్నాడు. అయితే తన తల్లి ఇచ్చిన సమాధానం తనను మరింత భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. 'నువ్వు వచ్చావు కదా.. నాకు అన్నీ తిరిగి వచ్చాయి' అని ఆమె చెప్పిన మాటలను మను మర్చిపోలేకపోయాడు. 'కొన్ని రుణాలు డబ్బుతో తీర్చలేం' అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

మను ప్రయాణం సాధారణ కుటుంబం నుంచి అసాధారణ విజయాన్ని అందుకున్న జర్నీగా నిలిచింది. ఝాన్సీలో పెరిగిన ఆయన హిందీ మీడియం ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. తర్వాత బుందేల్‌ఖండ్ యూనివర్సిటీలో బీసీఏ పూర్తి చేసి.. నిట్ తిరుచిరాపల్లి నుంచి మాస్టర్స్ చేశారు. మైక్రోసాఫ్ట్ ఇంటర్న్‌షిప్ సాధించి, అనంతరం అమెరికాలో ఉద్యోగ అవకాశాన్ని పొందాడు. తన కెరీర్ ప్రారంభ దశలను గుర్తుచేసుకుంటూ.. మైక్రోసాఫ్ట్ ఇంటర్న్‌గా ఉన్నప్పుడు రాత్రి 1 గంట వరకు పనిచేసేవాడినని గుర్తు చేసుకున్నాడు. ఎవరూ ఒత్తిడి చేయకపోయినా.. ఝాన్సీ నుంచి వచ్చిన తనలాంటి వ్యక్తి ఈ స్థాయికి చేరుకోవాలనే తపనతో కష్టపడ్డానని తెలిపారు.

ALSO READ : 14 ఏళ్ల కుర్రాడి సూపర్ ఆలోచన.. బెంగళూరు ఫుట్‌పాత్‌లను కాపాడేందుకు 'Raste' యాప్!

గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన అనుభవాలను మను పంచుకున్నాడు. గూగుల్ తనకు బెటర్మెంట్ నేర్పితే.. మైక్రోసాఫ్ట్ లోతైన బాధ్యత, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఇచ్చిందని చెప్పారు. అయితే ఈ విజయాలన్నింటి వెనుక తన తల్లిదండ్రుల త్యాగమే అసలైన ప్రేరణ అని మను అగర్వాల్ స్టోరీ నేటి యువతకు చెబుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News