Dailyhunt
టెహ్రాన్పై బాంబుల వర్షం..  25 మంది మృతి.. ఇజ్రాయెల్‌, అమెరికా భారీ దాడి

టెహ్రాన్పై బాంబుల వర్షం.. 25 మంది మృతి.. ఇజ్రాయెల్‌, అమెరికా భారీ దాడి

V6 Velugu 3 days ago
  • మృతుల్లో ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మజీద్‌ ఖదేమీ
  • సౌత్‌ పార్స్​ నేచురల్‌ గ్యాస్‌ ఫీల్డ్ లక్ష్యంగా మళ్లీ అటాక్‌
  • హార్మూజ్​పై ట్రంప్‌ హెచ్చరించిన మరుసటిరోజే మిసైల్స్​ వర్షం
  • ఇజ్రాయెల్‌, గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ ప్రతీకార దాడులు

టెహ్రాన్‌: హార్మూజ్‌ జలసంధిని తెరవకుంటే నరకం చూపిస్తామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన మరుసటిరోజు ఇరాన్‌పై మిసైళ్ల వర్షం కురిసింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన 'సౌత్​పార్స్‌' నేచురల్‌ గ్యాస్‌ ఫీల్డ్‌ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్‌ భీకర ఎయిర్‌ స్ట్రైక్స్‌కు దిగాయి. ఈ దాడుల్లో 25 మందికిపైగా మృతి చెందారు. సోమవారం ఉదయంనుంచి బాంబుల మోతతో టెహ్రాన్‌ సిటీ దద్దరిల్లింది. గంటల తరబడి యుద్ధ విమానాల శబ్దాలతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. అజాదీ స్క్వేర్ సమీపంలో ఒక వైమానిక దాడి షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణాన్ని తాకడంతో ఆ ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగ ఆవరించింది. ఈ ఘటనలో క్యాంపస్‌ భవనం తీవ్రంగా దెబ్బతినడంతో పాటు పరిసరాల్లోని సహజవాయువు సరఫరా చేసే పైప్‌లైన్‌ ధ్వంసమయ్యింది. యుద్ధం కారణంగా విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్‌ చీఫ్​ మృతి..

అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్‌జీసీ) ఇంటెలిజెన్స్ అధిపతి మజీద్ ఖదేమిని మృతిచెందారు. ఈ విషయాన్ని ఐఆర్‌జీసీ అధికారికంగా ధ్రువీకరించింది. తెల్లవారుజామున టెహ్రాన్ పరిసరాల్లో జరిగిన 'క్రిమినల్ టెర్రరిస్ట్ అటాక్'లో ఖదేమీ అమరుడయ్యారని తమ టెలిగ్రామ్ చానెల్‌లో పేర్కొన్నారు. ఖదేమీని తమ వైమానిక దళం హతమార్చిందని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించారు. ఇరాన్ నాయకులను వేటాడతామని హెచ్చరించారు. ఐఆర్​జీసీ పౌరులపై కాల్పులు జరుపుతుంటే తాము ఉగ్రవాద ముఠా నాయకులను అంతం చేస్తున్నామని అన్నారు. ఇరాన్ నాయకులు ప్రస్తుతం ప్రాణభయంతో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఇరాన్ ఆర్థిక వెన్నెముకను, క్షిపణి తయారీ సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి వారి కీలక మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగిస్తామని చెప్పారు. మరోవైపు లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడిలో 'లెబనీస్ ఫోర్సెస్' పార్టీ అధికారి, ఆయన భార్య మరణించారు.

ఇరాన్‌ ప్రతీకార దాడులు..

తమ దేశంపై దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్, గల్ఫ్‌ ప్రాంతంలోని పొరుగు దేశాలపై ఇరాన్‌ క్షిపణులతో అటాక్‌ చేసింది. దీంతో పశ్చిమాసియా అట్టుడికిపోయింది. ఇరాన్ క్షిపణులు ఉత్తర ఇజ్రాయెల్ నగరమైన హైఫాను తాకాయి. అక్కడ ఒక నివాస భవనం శిథిలాల కింద నలుగురు మరణించారు. మరోవైపు కువైట్, యూఏఈ, సౌదీ తమ వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను, డ్రోన్లను అడ్డుకున్నాయి. కాగా, ఇరాన్‌ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ1,900 మందికి పైగా మరణించారు. లెబనాన్‌లో1,400 మంది, ఇజ్రాయెల్‌లో 34 మంది మరణించారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News