Dailyhunt
తెలంగాణ రైజింగ్‌కు వ్యవసాయమే కీలకం : మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

తెలంగాణ రైజింగ్‌కు వ్యవసాయమే కీలకం : మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

V6 Velugu 1 week ago
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • సాయిల్ హెల్త్ పై పటాన్‌చెరు ఇక్రిశాట్‌లో వలంటీర్లకు ట్రైనింగ్‌

సంగారెడ్డి, వెలుగు : రైజింగ్‌ తెలంగాణ - 2045 లక్ష్యానికి అనుగుణంగా వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.

అగ్రిటెక్‌ వినియోగాన్ని ప్రోత్సహించడం, లాభసాటి పంటలు, పంటల విలువ, వృద్ధి ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. వ్యవసాయ శాఖ, ఇక్రిశాట్‌ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఇక్రిశాట్ వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన రెండు రోజుల శిక్షణను సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాలకు చెందిన ప్రతి గ్రామం నుంచి ఒక్కో రైతును ఎంపిక చేసి సాయిల్‌ హెల్త్ వలంటీర్‌గా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ శిక్షణలో భూసార పరీక్షలు, పంటల ఎంపిక, పంటల మార్పులు, వాతావరణ పరిస్థితుల ప్రభావం, అంతర్ పంటల సాగు, సేంద్రీయ వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. రైతుల ప్రధాన ఆస్తి భూమేనని, ఆ భూమి ఆరోగ్యంగా ఉంటేనే దిగుబడులు పెరిగి రైతుల ఆదాయం మెరుగుపడుతుందన్నారు. భూమి ఆరోగ్య పరిరక్షణపై రైతుల్లో అవగాహన పెంచడంలో సాయిల్ హెల్త్ వలంటీర్లు కీలకపాత్ర పోషించాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం గ్రామీణస్థాయికి చేరేలా వలంటీర్లు కృషి చేయాలన్నారు. రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూసారం దెబ్బతింటోందని మంత్రి పేర్కొన్నారు. పంటల మార్పిడి ద్వారా భూసారం పెంపొందించవచ్చన్నారు. రైతులు బయో ఫర్టిలైజర్లు, సేంద్రియ ఎరువులు వినియోగించడం ద్వారా భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.

అంతర్‌ పంటల సాగు ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందడమే కాకుండా నేల గుణాత్మకతను కూడా మెరుగుపరచని చెప్పారు. వ్యవసాయ యాంత్రిక పద్ధతులు, టెక్నాలజీ ఆధారంగా లాభదాయక వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అనంతరం ఇక్రిసాట్‌లో సాగు చేస్తున్న వివిధ రకాల పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమెహన్, ప్రొఫెసర్‌ జయశంకర్, అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ జానయ్య, కొండా లక్ష్మణ్, హార్టికల్చరల్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్ రాజిరెడ్డి, హార్టికల్చర్ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్‌ బాషా, ఇక్రిశాట్‌ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ స్టాన్‌ఫోర్డ్‌ బ్లాడే, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, జిల్లా అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ శివప్రసాద్ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News