Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగు రాష్ట్రాల్లో  సిమెంట్ ధరల మోత ..సెప్టెంబర్ 5 నుంచి బస్తాపై రూ.30-రూ.40 పెంచేందుకు ప్లాన్

తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరల మోత ..సెప్టెంబర్ 5 నుంచి బస్తాపై రూ.30-రూ.40 పెంచేందుకు ప్లాన్

V6 Velugu 1 week ago
  • దక్షిణాదిలో ఇక్కడే ఎక్కువ
  • బ్రాండ్ల బట్టి ధరల పెంపులో మార్పు
  • పెరగనున్న నిర్మాణ ఖర్చులు

హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో ఇళ్ల నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ రంగానికి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది.

ఉత్పత్తి, రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడంతో సిమెంట్ తయారీ సంస్థలు సెప్టెంబర్ 5 నుంచి హోల్సేల్ ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. 50 కిలోల బస్తాపై దాదాపు రూ.30 నుంచి రూ.40 వరకు పెంచాలని కంపెనీలు నిర్ణయించినట్లు మార్కెట్ డీలర్ల వర్గాలు స్పష్టం చేశాయి. ఈ తాజా నిర్ణయం అమల్లోకి వస్తే రెండు రాష్ట్రాల్లోని హోల్సేల్ మార్కెట్లో సిమెంట్ ధరలు దాదాపు 10శాతం వరకు పెరుగుతాయి. 'ఏ' కేటగిరీ బ్రాండ్ల ధర ప్రస్తుతం మార్కెట్లో 50 కిలోల బస్తాకు సుమారు రూ.285 పలుకుతుండగా, రూ.30 పెరుగుదలతో (సుమారు 10.5శాతం) ఇది రూ.315కు చేరే అవకాశం ఉంది. ' బీ' కేటగిరీ బ్రాండ్లు ప్రస్తుతం బస్తాకు దాదాపు రూ.250 పలుకుతుండగా, రూ.25 పెరిగి రూ.275కు చేరుకోవచ్చు. కంపెనీలు రూ.30 నుంచి రూ.40 మేర పెంచాలని చూస్తున్నప్పటికీ, బ్రాండ్లు, కేటగిరీల ఆధారంగా పెంపు మారుతుందని డీలర్లు తెలిపారు.

ఖర్చులు పెరగడమే కారణం..

ఈ ఏడాది ఆగస్టులో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సిమెంట్ కంపెనీలు బస్తాపై కేవలం రూ.10 మాత్రమే పెంచాయి. ప్రస్తుతం బస్తా ధర తమిళనాడులో రూ.310-రూ.315, కేరళలో రూ.320, కర్ణాటకలో రూ.320-రూ.330 మధ్య కొనసాగుతోంది. వీటన్నింటితో పోలిస్తే ఏపీ, తెలంగాణల్లో ప్రతిపాదించిన రూ.30-రూ.40 పెంపు దక్షిణాదిలోనే ఎక్కువగా నిలవనుంది. ముడిసరుకుల ఖర్చుతో పాటు ప్యాకేజింగ్, రవాణా (ఫ్రైట్) ఖర్చులు బాగా పెరిగిపోవడమే ఈ పెంపునకు ప్రధాన కారణం. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో దేశవ్యాప్తంగా సగటున బస్తాకు రూ.15 మాత్రమే పెరిగింది.

అయితే ప్రస్తుత ఖర్చుల ఒత్తిడిని తట్టుకోవాలంటే కంపెనీలకు బస్తాకు రూ.35 నుంచి రూ.40 వరకు పెంపు తప్పనిసరిగా మారిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు త్వరలో ప్రారంభం కానున్న పండుగల సీజన్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఈ ధరల సర్దుబాటును తెరపైకి తెచ్చినట్లు హైదరాబాద్లోని ఒక సిమెంట్ డిస్ట్రిబ్యూటర్ పేర్కొన్నారు. అయితే పెరిగిన ఖర్చుల భారాన్ని తగ్గించుకోవడానికి కంపెనీలకు ఈ సమయం అనుకూలంగా ఉన్నా, ఇది సామాన్యుడి నిర్మాణ ఖర్చుపై నేరుగా ప్రభావం చూపనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News