వరంగల్ జిల్లా: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మార్కెట్ సమీపంలోని సాయి ప్లాస్టిక్ కంపెనీలో మంటలు చెలరేగాయి.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.ప్లాస్టిక్ వస్తువులు పెద్ద ఎత్తున దగ్ధం కావడంతో మంటలు వేగంగా వ్యాపించడంతో పాటు భారీగా పొగలు కమ్ముకున్నాయి. ప్లాస్టిక్ కాలిపోవడంతో వెలువడుతున్న ఘాటు వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది.
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో మిర్చి కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. దీంతో అగ్నిప్రమాదం మరింత విస్తరించే అవకాశం ఉందేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంటలు కోల్డ్ స్టోరేజీల వైపు వ్యాపించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగిందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందా? లేదా మరేదైనా కారణం ఉందా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేయనున్నారు.

