Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెలుగు ఓపెన్ పేజీ.. గద్దర్ స్వరం సజీవం

వెలుగు ఓపెన్ పేజీ.. గద్దర్ స్వరం సజీవం

V6 Velugu 1 week ago

గుమ్మడి విట్టల్‌రావు అనే పేరుతో జన్మించిన గద్దర్ భౌతికంగా మన మధ్య లేక మూడు సంవత్సరాలు పూర్తయినా ఆయన స్వరం మాత్రం మౌనమవ్వలేదు. ఆయన పాటలు, భావజాలం, ప్రజలతో మమేకమైన జీవితం ఇప్పటికీ ఉద్యమాలకు స్ఫూర్తినిస్తున్నాయి.

ప్రజల బాధను పాటగా, పాటను పోరాటంగా, పోరాటాన్ని చరిత్రగా మలిచిన అరుదైన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్. దాదాపు ఆరు దశాబ్దాలపాటు ప్రజలతో మమేకమై, నక్సల్బరీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, దళిత -బహుజన ఉద్యమం, ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమాలు, సాంస్కృతిక ఉద్యమాలకు తన గాత్రంతో ఊపిరిపోశారు.

ఆయన పాటలు కేవలం వినోదం కోసం కాదు. అవి సామాజిక చైతన్యానికి ఆయుధాలు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఆలపించిన 'పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా... పోరు తెలంగాణమా...' అనే గీతం ఉద్యమానికి అపూర్వమైన సాంస్కృతిక శక్తిని అందించింది. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచారు. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. దళితులపై జరుగుతున్న హింసను నిరంతరం ప్రశ్నించారు.

1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై జరిగిన హత్యాయత్నం భారత ప్రజాస్వామ్య చరిత్రలో సంచలనాత్మక ఘటన. ఆయనపై కాల్పులు జరిపి హత్య చేయాలని ప్రయత్నించినప్పటికీ, మరణం అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు.

శరీరంలో బుల్లెట్‌తోనే జీవితాంతం జీవించినా, ఆయన స్వరం మాత్రం మరింత శక్తిమంతమైంది. ఈ ఘటన ఆయనను భయపెట్టలేదు. ప్రజలతో ఆయన అనుబంధాన్ని మరింత బలపరిచింది. హత్యాయత్నం అనంతరం గద్దర్ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షకుడిగా దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందారు.

తెలంగాణ ఉద్యమానికి సాంస్కృతిక శక్తి

తెలంగాణ రాష్ట్ర సాధన రాజకీయ నాయకత్వం ఒక్కటితో సాధ్యపడలేదు. ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, భావోద్వేగాన్ని నింపిన సాంస్కృతిక ఉద్యమం కూడా అంతే కీలకం. 1990ల నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు వేలాది సభల్లో ఆయన పాటలతో ప్రజలను చైతన్యపరిచారు. జిల్లాలవారీగా సాంస్కృతిక బృందాలను ఏర్పాటు చేసి, పాటలు, నాటికలు, సభల ద్వారా ఉద్యమాన్ని సామాన్య ప్రజల జీవితంలో భాగం చేశారు. నీటి పంపిణీలో అన్యాయం, ప్రాంతీయ అసమానతలు, నిరుద్యోగం, కుల వివక్ష, వనరుల దోపిడీ, సాంస్కృతిక అణచివేత వంటి సమస్యలను ఆయన పాటలు ప్రజల ముందుకు తీసుకొచ్చాయి.

పోరాటమే జీవితం

గద్దర్ జీవితమంతా పోరాటమే. విప్లవ ఉద్యమాల్లో పాల్గొనడంతోపాటు 2004లో ప్రభుత్వం-పీపుల్స్ వార్ మధ్య జరిగిన శాంతి చర్చల్లో మధ్యవర్తిగా కీలక పాత్ర పోషించారు. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తన ఆలోచనలను విస్తరించుకుంటూ, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, కుల నిర్మూలన, ప్రజాస్వామ్య హక్కుల కోసం తన గళాన్ని నిరంతరం వినిపించారు. భారత్ జోడో యాత్రలో పాల్గొని ప్రజా స్వామ్య పరిరక్షణ అవసరాన్ని ప్రజల్లో చాటిచెప్పారు. మణిపూర్ హింస, మహిళలపై దాడులు, క్రీడా కారిణులపై లైంగిక వేధింపులు, బిల్కిస్ బానో కేసు వంటి మానవ హక్కుల అంశాలపై కూడా తన ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేశారు.

గద్దర్ యుగం

గద్దర్ కేవలం ఒక గాయకుడు కాదు. ఒక ఉద్యమం, ఒక సిద్ధాంతం, ఒక సాంస్కృతిక విప్లవం. ఆయన కళ పాట, నృత్యం, నాటకం, శారీరక అభినయం, భావోద్వేగ వ్యక్తీకరణల సమ్మేళనం. డా. బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, కబీర్ వంటి మహనీయుల ఆలోచనలు ఆయన భావజాలాన్ని ప్రభావితం చేశాయి. తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయాలు సాధించి ఉండవచ్చు. కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కోట్లాది ప్రజల హృదయాల్లో నాటింది గద్దర్ పాట. భౌతికంగా గద్దర్ మన మధ్య లేకపోయినా ఆయన గళం ఇంకా ప్రజల గొంతుల్లో వినిపిస్తూనే ఉంది. ఆయన పాటలు ఇంకా ఉద్యమాల్లో మారుమోగుతూనే ఉన్నాయి. అందుకే గద్దర్ ఒక వ్యక్తి కాదు. ఒక యుగం. ఒక సిద్ధాంతం. ఒక శాశ్వత స్ఫూర్తి.

- డా. జి.వి. వెన్నెల గద్దర్
చైర్‌పర్సన్, తెలంగాణ సాంస్కృతిక సారథి
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు 'వెలుగు' కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News