Dailyhunt
వెలుగు ఓపెన్ పేజీ :  కమ్యూనిస్టుల చరిత్ర, పోరాటాలు తెలియకపోవడం అమిత్‌ షా అజ్ఞానం!

వెలుగు ఓపెన్ పేజీ : కమ్యూనిస్టుల చరిత్ర, పోరాటాలు తెలియకపోవడం అమిత్‌ షా అజ్ఞానం!

V6 Velugu 1 week ago

నిండు పార్లమెంట్ సాక్షిగా సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కమ్యూనిస్టులపై పచ్చి అబద్ధాలు మాట్లాడడం, సీపీఐ రష్యా కమ్యూనిస్టు పార్టీ శాఖ అని చెప్పడం చరిత్రను వక్రీకరించడమే.

అది ఆయన అజ్ఞానానికి నిదర్శనం. 1925లో ఉత్తరప్రదేశ్​లోని కాన్పూర్‌లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. అంతకుముందే కమ్యూనిస్టులు స్వాతంత్ర్యోద్యమంలో బ్రిటిష్​ పాలకులకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ప్రజాసంఘాలు ఏర్పాటుచేసి, దేశ స్వాతంత్య్ర పోరాటంలో అనేక త్యాగాలు, పోరాటాలు చేసిన ఘనత సీపీఐది. మీరట్, కాన్పూర్, పెషావర్ కుట్ర కేసులు ఆనాటి నాయకత్వంపై బ్రిటిష్ పాలకులు కుట్ర కేసులు పెట్టిన విషయం రికార్డులో ఉంటుంది కదా.

కమ్యూనిస్టు పార్టీలంటేనే అమిత్​ షాకి ఏవగింపుగా ఉన్నది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలో ఉన్నప్పుడు.. చత్తీస్​గఢ్​లో సల్వా
జుడుం సంస్థ ఏర్పాటు చేయడాన్ని చట్ట విరుద్ధమని తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును కూడా లోక్‌సభలో కేంద్ర మంత్రి అమిత్‌ షా తప్పుబట్టడం అంటే న్యాయ వ్యవస్థను కించపరిచినట్టే అవుతుంది. భూస్వాములు ప్రైవేటు ఆర్మీ సల్వాజుడుంను సమర్థించినట్లుగా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయి. సల్వాజుడుం పేరుతో వారు తుపాకులు పట్టుకొని సామాన్యులపై అరాచకం చేయలేదా? అనేకమందిని పొట్టనబెట్టుకోలేదా? రాజ్యాంగ పరిధిలో లేకుండా పోరాడుతున్నవారిపై తుపాకులు పట్టిన సల్వాజుడుంను పాలకపక్షాలు ప్రోత్సహించడం జగమెరిగిన సత్యమే. అలా తుపాకులు ధరించి చట్టాన్ని చేతుల్లో తీసుకోవడాన్నే రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ సుదర్శన్​ రెడ్డి సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఒక్కరికే ఎలా ఆపాదిస్తారు. అది వ్యక్తి తీర్పు కాదు.. న్యాయవ్యవస్థ ఇచ్చిన తీర్పు. దానిని వ్యతిరేకించాలనుకుంటే అప్పీలు చేసుకొని వాదనలు వినిపించే అవకాశమూ ఉంది. కానీ, స్వయంగా కేంద్ర హోం మంత్రి ఒక న్యాయ మూర్తి తీర్పుపై లోక్‌సభలో వ్యాఖ్యలు చేయడం న్యాయవ్యవస్థ స్థైర్యాన్ని దెబ్బతీయడమే అవుతుంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రతిపక్షాల కూటమి తరపున ఉప రాష్ట్ర పతి ఎన్నికల్లో పోటీ చేయడమే హోం మంత్రి అక్కసుకు కారణం. దానిని ఆయన దాచుకోలేదు కూడా. గతంలో కూడా ఆయనను అర్బన్ నక్సలైట్ అన్నారు. తాము బలపరిచే అభ్యర్థిపై పోటీకి దిగితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమనే హెచ్చరికలు ఇందులో దాగి ఉన్నాయి. ఈ వైఖరి ప్రజాస్వామ్యంలో ఏమాత్రం శ్రేయస్కరం కాదు.

దోపిడీకి వ్యతిరేకం కమ్యూనిస్ట్​ సిద్ధాంతం

ఎర్రజెండా లేకుండా పోరాటం లేదు. ఆకలి కేకలు ఎక్కడ ఉంటే అక్కడ ఎర్రజెండా ఉంటుంది. దోపిడీని వ్యతిరేకిస్తుంది. కమ్యూనిస్టు సిద్ధాంతం గురించి అమిత్‌ షాకి ఇంకా తెలియకపోవడమంటే.. ఆయన రాజకీయంగా ఎంత పరిపక్వతకు చెందారో అర్థం అవుతుంది. కమ్యూనిస్టులను అణచివేసే ధోరణిలోనే అమిత్‌ షా ఉన్నారు. అందుకు కారణం ఎన్‌డిఎ ప్రభుత్వం చేస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల విధానాలను అడుగడుగునా ఎండగట్టడమే. వలసవాద అధికారాన్ని ఎదుర్కొన్నందుకు కమ్యూనిస్టులు జైలుశిక్షలు, బహిష్కరణలు, అణచివేతలను ఎదుర్కొన్నారు. సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించడంలో సీపీఐ కీలక పాత్ర పోషించింది అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆర్ఎస్ఎస్ 1925లో స్థాపించినప్పుడు వలస వ్యతిరేక పోరాటాలకు దూరంగా ఉండే ధోరణితో వ్యవహరించింది.

స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టు పార్టీలు

స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టు పార్టీలు ప్రత్యక్షంగా పుట్టుకొచ్చాయి. అనాటికి బీజేపీ లేదు. ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలను పుణికిపుచ్చుకొని బీజేపీ రాజకీయం చేస్తున్నది. అలాంటి బీజేపీకి చెందిన అమిత్‌ షా కమ్యూనిస్టు పార్టీల చరిత్ర, వీరోచిత పోరాటాలు, త్యాగాలు తెలియకపోవడం ఆయన అజ్ఞానాన్ని మరింత రుజువు చేస్తున్నది. వారికి మతాలు, కులాల మధ్య చిచ్చులుపెట్టి, అమెరికా సామ్రాజ్యవాదంతో చేతులు కలపడం తప్ప, ప్రజాసమస్యలు పట్టవు. ప్రజలపై జీఎస్టీల పేర అధిక డబ్బులు వసూలు చేసి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల నిర్ణయాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు నిరంతరం పోరాటం చేస్తున్నాయనే అక్కసుతోనే కమ్యూనిస్టు పార్టీల మీద అమిత్‌ షా విషం
చిమ్ముతున్నాడు.

మావోయిస్టులపై డెడ్​లైన్​ అమిత్​ షా భ్రమ

2026 మార్చి 31 అనే డెడ్‌లైన్ పెట్టి మావోయిస్టులను ఏరివేశాం అనుకోవడం అమిత్ షాకు భ్రమగానే మిగులుతుంది. మృతదేహాలను కూడా అప్పజెప్పకుండా సామూహిక దహన సంస్కారాలు చేసిన విధానాన్ని సభ్య సమాజం నివ్వెరపోయింది. బ్యాలెట్ ద్వారా ప్రజల సమస్యలకు పరిష్కారం లభించదని మావోయిస్టులు పంథా మార్చుకొని అజ్ఞాతంలో ఉండి తుపాకి గొట్టం ద్వారా ఉద్యమాలు చేస్తున్నారు. సీపీఐ, సీపీఐ(ఎం), కొన్ని వామపక్ష పార్టీలు రాజ్యాంగం మీద నమ్మకంతో ప్రజల మధ్య ఉండి ప్రత్యక్షంగా ప్రజా పోరాటాలు చట్టబద్ధంగా ఉద్యమాలు చేస్తున్నాయి. అయితే పంథా వేరైనా, ఎవరూ ఏ పోరాటం చేసినా ప్రజలకు న్యాయం చేయాలని, వారి సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతోనే కమ్యూనిస్టులు ఉన్నారు. అయితే మావోయిస్టు పార్టీలకు కూడా తమ పంథా మార్చుకొని ప్రజల మధ్యకు రావాలని సీపీఐ పలు సందర్భాలో విజ్ఞప్తి చేయడం జరిగింది. తుపాకి గొట్టం ద్వారా ప్రజాసమస్యలు పరిష్కారంకావని తెలియజేయడం జరిగింది.

రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు

ఇటీవల మావోయిస్టులను ఏరివేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ మంత్రి అమిత్​ షా తప్పుడు పద్ధతులతో రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు. మావోయిస్టులనే కాదు. ప్రజాస్వామిక గొంతులను నొక్కిపెట్టారు. వరవరరావు, సాయిబాబా లాంటి వారిని జైల్లో నిర్బంధించి అనేక ఇబ్బందులకు గురిచేసిన సంఘటనలు చాలావరకు ఉన్నాయి. మావోయిస్టుల అంత్యక్రియలకు వెళ్ళిన ప్రగతిశీల శక్తులపై ఎన్ఐఏ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. రాజ్యాంగ ప్రవేశ పీఠికలో పౌరులకు ఎలాంటి హక్కులు ఉన్నాయో అమిత్ షా నిశితంగా పరిశీలిస్తే మంచిది. పౌరులు తమకు నష్టం జరిగినప్పుడు, హక్కులు హరించినప్పుడు ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది. ఇదేమీ రాచరిక వ్యవస్థ కాదు. దాని స్థానంలో ప్రజలు పోరాడి స్వాతంత్ర్యం సాధించుకుని ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగాలని ప్రజలు కోరుకోవడం, దానికి అనుగుణంగా డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్​ రాజ్యాంగాన్ని పొందుపరచడాన్ని గమనంలో
ఉంచుకోవాలి. సంపద అందరికీ అందాలి. చెందాలనే సిద్ధాంతాన్ని బీజేపీ, ఎన్డీఏ పాలకులు గుర్తించాలి. దీనిపై ప్రగతిశీల, ప్రజాస్వామ్య,
పౌర హక్కుల కోసం నడుం బిగించాలి.

- చాడ వెంకటరెడ్డి
సీపీఐ సీనియర్ నాయకుడు

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు 'వెలుగు' కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News