హైదరాబాద్: తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకు తన రాజీనామా లేఖను పంపారు.
ఈ సందర్భంగా తన రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. తనకు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్‌పర్సన్‌గా సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
విద్యా కమిషన్ చైర్మన్గా విద్యపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించానని, ప్రభుత్వం ఇచ్చిన పనిని పూర్తి చేసిన క్రమంలో.. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.
మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గత కొంత కాలంగా విద్యా, వైద్య రంగాలపై రాష్ట్రంలో అధ్యయనం చేస్తున్న సంగతి తెలిసిందే. భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తించి పేదలు, ఆదివాసీల మన్ననలు పొందారు.
కేసీఆర్ ప్రభుత్వంలో అణిచి వేతలకు గురైన ఆయన స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశారు. ఆకునూరి ప్రతిభను గుర్తించిన ఏపీ ప్రభుత్వం.. ఆ రాష్ట్రంలో ఆయన సేవలను వినియోగించుకొంది. విద్య, మౌలిక సదుపాయాల కల్పన సలహాదారుగా నియమించింది.
పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన ఆయన ఏపీలో మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రాండ్ సక్సెస్ అయ్యారు. పిల్లలకు ఇంగ్లీషు మీడియం అమలునూ విజయవంతం చేయగలిగారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో మన ఊరు-మన బడి కార్యక్రమాన్నిఇంప్లిమెంట్ చేసింది.
ఆకునూరి మురళి స్వస్థలం మంచిర్యాల జిల్లా. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆకునూరి మురళి సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. విద్యా కమిషన్ చైర్మన్‌గా ఆయనను నియమించింది.

