Dailyhunt
విజయన్‌ దిగిపోయే టైమొచ్చింది: సీఎం రేవంత్ రెడ్డి

విజయన్‌ దిగిపోయే టైమొచ్చింది: సీఎం రేవంత్ రెడ్డి

V6 Velugu 3 weeks ago
  • కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి
  • ఇక్కడ మూడింట రెండో వంతు మెజార్టీతో గెలవబోతున్నం
  • ఊమెన్ చాందీ తరహా పాలన అందిస్తం
  • విజయన్ నాకు రాసిన లేఖలో 2014 నుంచి 2023 వరకు జరిగిన విషయాలే ఉన్నాయి..
  • ఆ కాలంలో విజయన్ మిత్రుడు కేసీఆరే సీఎంగా ఉన్నారు
  • పినరయిపై బంగారం చోరీ, స్మగ్లింగ్ కేసులున్నా.. మోదీ రక్షిస్తున్నారు
  • గాంధీ కుటుంబాన్ని, కేజ్రీవాల్‌ను కేసుల పేరుతో వేధిస్తున్నారని ఫైర్

హైదరాబాద్, వెలుగు: కేరళ సీఎంగా పినరయి విజయన్ వైదొలిగే సమయం ఆసన్నమైందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన 120 నెలల పాలన కాలమంతా వైఫల్యానికి ప్రతీకగా నిలిచిందని విమర్శించారు. మంగళవారం కేరళ రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లలో రేవంత్‌రెడ్డి పాల్గొని.. అక్కడి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఇక్కడ మూడింట రెండొంతుల మెజార్టీతో యూడీఎఫ్ గెలవబోతున్నదని చెప్పారు. ఊమెన్ చాందీ తరహా పాలనను అందిస్తామని తెలిపారు. ఇక్కడ పంచాయతీ రాజ్ వ్యవస్థ విజయం సాధించిందని, దాన్ని తాము అభినందిస్తున్నామని చెప్పారు. దీనికి కాంగ్రెస్ సీఎంలు కరుణాకరన్, ఊమెన్ చాందీలే కారణమని వెల్లడించారు.

ఎక్కడైనా మంచి జరిగితే తాము అభినందిస్తామని అన్నారు. తాను పినరయి విజయన్ హయాంలోని వైఫల్యాలను ఎత్తి చూపానని తెలిపారు. కేరళలో సరైన ఉపాధి, ఉద్యోగావకాశాలు లేకపోవడంతో యువత ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారని, ఇక్కడ ఎక్కడ చూసినా వృద్ధులు, చిన్న పిల్లలే కనిపిస్తున్నారని, ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. విద్యావంతులు, నైపుణ్యం ఉన్న యువత విదేశాలకు వెళ్లడం కేరళకు మంచిది కాదని తెలిపారు. వాళ్లు తిరిగి స్వరాష్ట్రం వచ్చి ఉపాధి పొందేలా చేస్తామని చెప్పారు. తెలంగాణ మాదిరి అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ నియామకాలు, స్వీయ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడంలాంటివి కేరళలో అమలు చేస్తామన్నారు. ''పినరయి విజయన్‌తోపాటు కేరళ కమ్యూనిస్టు మహిళా నాయకులను తెలంగాణకు ఆహ్వానిస్తున్నా.. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు మేం చేస్తాం.. తెలంగాణలోని ఏ మూలకైనా వెళ్లి మేం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులను వారు పరిశీలించుకోవచ్చు, ఈ విషయంలో నేను విజయన్‌కు సవాల్ విసురుతున్నా'అని పేర్కొన్నారు.

67 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం..

తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చాక 67 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.20,670 కోట్ల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్‌ తెలిపారు. 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని, రూ. 500కే గ్యాస్ సిలిండర్‌ను సరఫరా చేస్తున్నామని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలన్నీ అమలు చేస్తున్నామని, విజయన్ తెలంగాణకు వచ్చి అన్నీ పరిశీలించుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ ఎన్నిలు తెలంగాణ, కేరళకు మధ్య కాదని, యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య జరుగుతున్నాయని చెప్పారు. తాము ఏం చేస్తున్నామో అదే చెబుతున్నామని, తమ సవాళ్లకు విజయన్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ''విజయన్ నాకు రాసిన లేఖలో 2014 నుంచి 2023 మధ్య తెలంగాణ పాలనలో జరిగిన విషయాలను ప్రస్తావించారు. ఆ కాలంలో ఆయన సన్నిహిత మిత్రుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారు' అని సెటైర్ వేశారు. కేసీఆర్ పాలనలో తప్పులు జరగడంతోనే ప్రజలు ఆయనను మార్చివేశారని, ఇప్పుడు విజయన్‌ను కేరళ ప్రజలు మార్చివేస్తారని రేవంత్ చెప్పారు. విజయన్‌పై శబరిమల బంగారం చోరీ, బంగారం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయని, విజయన్ గాడ్ ఫాదర్ నరేంద్ర మోదీ ఢిల్లీలో ఉన్నారని, మోదీనే ఈ కేసులన్నింటి నుంచి విజయన్‌ను రక్షిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. దేశం కోసం తమ జీవితాలను, ఆస్తులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని రకరకాల కేసులతో వేధిస్తున్నారని ఫైర్​ అయ్యారు. కేజ్రీవాల్ సహా అనేక మంది నేతలను ఈడీ కేసులతో వేధించి అరెస్టు చేసిన వాళ్లు.. విజయన్ జోలికి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ, విజయన్ మధ్య ఉన్న అవగాహనతోనే కేసులు, అరెస్టులు లేవని ఆరోపించారు. ఈ ఇద్దరి బంధాన్ని కేరళ ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు.

బంగారం, స్మగ్లింగ్‌ కేసు ఎందుకు పరిష్కారం కాలేదు

కేరళ ప్రభుత్వం స్వచ్ఛమైందే అయితే బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో మీ కార్యాలయంలోని ఉన్నతాధికారులు, కీలకమైన వ్యక్తులకు సంబంధాలు ఉన్నాయని డాక్యుమెంట్లతో సహా నిరూపించబడినా.. ఆ కేసు ఎందుకు అపరిష్కృతంగా మిగిలిపోయిందని విజయన్‌కు రాసిన లేఖలో రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. శబరిమల అయ్యప్ప ఆలయం నుంచి 4.5 కిలోల బంగారం అక్రమ తరలింపు ఆరోపణలకు ఎందుకు జవాబు చెప్పడం లేదని ప్రశ్నించారు. కేరళలో కొద్ది రోజుల్లో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం 'నవ కేరళం ' దార్శనికతను అమలు చేస్తుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News