Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రజారోగ్యంతో చెలగాటం..హోటళ్లు, బేకరీల్లో కుళ్లిన తిండి!

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రజారోగ్యంతో చెలగాటం..హోటళ్లు, బేకరీల్లో కుళ్లిన తిండి!

V6 Velugu 2 weeks ago
  • ప్రభుత్వం నిషేధించినా ఆగని 'మయోనైజ్' విక్రయాలు
  • పాడైన చికెన్, కుళ్లిపోయిన గుడ్లతోనే వంటకాల తయారీ
  • నోటీసులు జారీ చేసినా మొండికేస్తున్న నిర్వాహకులు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, బేకరీలలో ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్న దారుణ పరిస్థితులు వెలుగుచూశాయి. అపరిశుభ్ర వాతావరణంలో కాలం చెల్లిన, పాడైపోయిన ఆహార వస్తువులతో ఫుడ్ ఐటమ్స్ వండి నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇవేమీ తెలియని వినియోగదారులు డబ్బులు ఖర్చు చేసి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అధికారులు నోటీసులు జారీ చేసి, కేసులు నమోదు చేస్తున్నా హోటల్స్ నిర్వాహకుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు.

గతంలో నోటీసుల ఇచ్చి వదిలేశారు..

గతంలో భువనగిరిలోని ఓ ప్రముఖ హోటల్‌లో భోజనంలో జెర్రీ రావడం తీవ్ర కలకలం రేపింది. అప్పట్లో కాలం చెల్లిన సాస్‌లు, వాటర్ బాటిల్స్ దొరకడంతో అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పచ్చిగుడ్లు, పచ్చి నూనె, వెనిగర్‌తో తయారు చేసే 'మయోనైజ్' తిని గతంలో హైదరాబాద్, బంజారాహిల్స్‌లో ఒకరు మృతి చెంది, 50 మంది ఆస్పత్రి పాలవడంతో ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది. అయినప్పటికీ పిజ్జా, బర్గర్, మోమోస్, షవర్మా వంటి ఫుడ్ ఐటమ్స్‌తో కలిపి ఇప్పటికీ దీన్ని విరివిగా అమ్ముతున్నారు.

తాజా తనిఖీల్లో ఏకంగా 20 లీటర్ల నిషేధిత మయోనైజ్ నిల్వలను అధికారులు పట్టుకున్నారు. టేస్ట్ కోసం ప్రమాదకరమైన పౌడర్లు, ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కేవలం నోటీసులతో సరిపెట్టకుండా, నిబంధనలు ఉల్లంఘిస్తున్న హోటళ్లు, బేకరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనిఖీలను నిరంతరం కొనసాగించాలని స్థానిక ప్రజలు
డిమాండ్ చేస్తున్నారు.

ఇటీవల తనిఖీల్లో..

ఇటీవల భువనగిరిలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి. స్వాతి ఆధ్వర్యంలో హోటళ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫ్రిజ్‌ల్లో రోజులుగా నిల్వ ఉంచిన చికెన్, నెలల కింద కొనుగోలు చేసిన గుడ్లు, పగిలిపోయిన గుడ్లతో వంటలు చేస్తున్నట్లు గుర్తించారు. కిచెన్లలో డస్ట్ బిన్ల పక్కనే నేలపై వండిన వంటలను నిల్వ ఉంచడం, గడువు ముగిసిన సాస్‌లను ఎగ్ పప్స్‌లో వాడడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి. వంట గదుల్లో ఎలుకలు, బొద్దింకలు, పురుగులు తిరుగుతున్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News