Veligonda Phase-1 : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దశాబ్దాలుగా తీవ్ర వర్షాభావం, ఫ్లోరైడ్ సమస్యలు మరియు సాగునీటి ಕೊరతతో అల్లాడుతున్న కరువు ప్రాంతాలకు విముక్తి కలిగిస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభమైంది.
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించి, నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేశారు. 1996లో శంకుస్థాపన నోచుకున్న ఈ ప్రాజెక్టు 30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరవాత పూర్తికావడం ఈ ప్రాంత జలాశయ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టంగా నిలిచింది. నల్లమల అడవుల గుండా అత్యంత సంక్లిష్టమైన ఇంజనీరింగ్ సాంకేతికతతో సొరంగ మార్గాలు నిర్మించి కృష్ణా వరద నీటిని మళ్లించేలా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు.

నాలుగు జిల్లాల ప్రజలకు సాగు, తాగునీటి ప్రయోజనాలు
వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 అందుబాటులోకి రావడం వల్ల ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు మరియు కడప జిల్లాల్లోని పలు మండలాలకు మహర్దశ పటనుంది. తొలిదశ ద్వారా సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా 4 లక్షల మందికి పైగా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది. శ్రీశైలం జలాశయం నుంచి దాదాపు 43 టీఎంసీల వరద నీటిని మళ్లించడమే లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి విడతలో 10.70 టీఎంసీలను నల్లమల సాగర్‌కు తరలిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు పెరిగి ఫ్లోరైడ్ ముప్పు తగ్గడంతో పాటు, ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు తగ్గుతాయని భావిస్తున్నారు.

