Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
41 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ఫిఫా నాకౌట్‌లో అరుదైన ఘనత

41 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ఫిఫా నాకౌట్‌లో అరుదైన ఘనత

వార్త 3 weeks ago

Cristiano Ronaldo: పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన కెరీర్‌లో మరో అద్భుత మైలురాయిని అందుకున్నాడు. 2026 ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 32లో భాగంగా క్రొయేషియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆయన ఈ రికార్డు సాధించాడు.

41 సంవత్సరాల 147 రోజుల వయసులో గోల్ కొట్టిన రొనాల్డో.. వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో గోల్ చేసిన అత్యంత వృద్ధ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 40 ఏళ్లు దాటిన తర్వాత నాకౌట్ స్టేజ్‌లో గోల్ చేసిన తొలి ప్లేయర్ కూడా ఆయనే. గతంలో ఈ రికార్డు పోర్చుగల్‌కే చెందిన పెపే (39 ఏళ్ల 283 రోజులు - 2022 వరల్డ్ కప్) పేరిట ఉండేది. అంతేకాదు, ప్రపంచకప్ నాకౌట్ దశలో రొనాల్డోకు ఇదే మొదటి గోల్ కావడం విశేషం.

ఉత్కంఠభరిత పెనాల్టీ గోల్‌తో స్కోరు సమం

ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో తొలుత క్రొయేషియా ఆటగాడు ఇవాన్ పెరిసిక్ గోల్ చేసి తన జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. అయితే సెకండ్ హాఫ్‌లో పోర్చుగల్‌కు ఒక సువర్ణావకాశం లభించింది. పోర్చుగల్ డిఫెండర్ రెనాటో వీగాను బాక్స్ లోపల ప్రత్యర్థి ఆటగాడు ఫౌల్ చేయడంతో రిఫరీ పెనాల్టీగా ప్రకటించారు. ఈ ఒత్తిడి సమయంలో స్పాట్ కిక్ తీసుకున్న రొనాల్డో.. ఏమాత్రం తడబడకుండా బంతిని నెట్‌లోకి పంపి స్కోరును 1-1తో సమాం చేశాడు. ఈ గోల్‌తోనే ఆయన సరికొత్త ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Cristiano Ronaldo: రొనాల్డో తొలి గోల్‌ను చెరిపేసిన వీఏఆర్ (VAR)

నిజానికి ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్‌లోనే రొనాల్డో ఒక వండర్ గోల్ చేశాడు. డిఫెన్స్ లైన్ దాటుకుంటూ వచ్చిన ఏరియల్ పాస్‌ను చాకచక్యంగా నియంత్రించి క్రొయేషియా కీపర్ లివాకోవిచ్‌ను బోల్తా కొట్టించి గోల్ చేశాడు. అయితే, రొనాల్డో సెలబ్రేషన్స్ ఎంతోసేపు నిలవలేదు. వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) పరిశీలనలో రొనాల్డో భుజం స్వల్పంగా ఆఫ్‌సైడ్ పొజిషన్‌లో ఉన్నట్లు తేలడంతో రిఫరీ ఆ గోల్‌ను రద్దు చేశారు.

గొంకాలో రామోస్ మెరుపులు.. పోర్చుగల్ ముందంజ

రొనాల్డో పెనాల్టీ గోల్ తర్వాత పోర్చుగల్ మరింత దూకుడు పెంచింది. ఆ జట్టు యువ స్టార్ గొంకాలో రామోస్ అద్భుతమైన గోల్ చేయడంతో పోర్చుగల్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ గోల్ మ్యాచ్ గమనాన్ని మార్చేసింది.

చివరి నిమిషంలో వీఏఆర్ డ్రామా.. రౌండ్ ఆఫ్ 16లోకి పోర్చుగల్!

మ్యాచ్ ముగిసే సమయానికి మరో ఉత్కంఠభరితమైన సీన్ చోటుచేసుకుంది. క్రొయేషియా ఆటగాడు జోస్కో గ్వార్డియోల్ ఒక గోల్ చేసి మ్యాచ్‌ను సమం చేసినంత పని చేశాడు. కానీ, ఇక్కడే వీఏఆర్ (VAR) మళ్లీ ఎంటర్ అయింది. గ్వార్డియోల్ గోల్ కొట్టడానికి ముందు, తోటి ఆటగాడు మారియో పసాలిక్ ఆఫ్‌సైడ్‌లో ఉన్నట్లు రీప్లేలో స్పష్టమైంది. దీంతో ఆ గోల్‌ను రిఫరీ నిరాకరించారు. చివరికి పోర్చుగల్ 2-1తో క్రొయేషియాపై విజయం సాధించి, సగర్వంగా రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha