Human Trafficking Case: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన మానవ అక్రమ రవాణా కేసులో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2019లో పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
సాక్ష్యాధారాలు, దర్యాప్తు నివేదికలను పరిశీలించిన అనంతరం కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. శిక్ష పడిన వారిలో 8 మంది బంగ్లాదేశ్‌కు చెందిన పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Read Also :KTR Formula E Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణ వాయిదా
ఉద్యోగాల పేరుతో మహిళల అక్రమ రవాణా

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి బంగ్లాదేశ్‌కు చెందిన మహిళలను అక్రమంగా భారతదేశానికి తీసుకొచ్చారు. అనంతరం వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మానవ అక్రమ రవాణా, మహిళల అక్రమ తరలింపు, వ్యభిచారానికి బలవంతం చేయడం వంటి అభియోగాలపై నిందితులపై కేసులు నమోదు చేశారు.
Human Trafficking Case: ఎన్‌ఐఏ దర్యాప్తుతో వెలుగులోకి వచ్చిన నిజాలు
ఈ కేసు ప్రారంభంలో స్థానిక పోలీసులు నమోదు చేయగా, తరువాత దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేపట్టింది. బాధిత మహిళల వాంగ్మూలాలు, ఇతర సాక్ష్యాలు, పత్రాధారాల ఆధారంగా నిందితులపై అభియోగాలు నిరూపితమయ్యాయని కోర్టు పేర్కొంది. మహిళలను ఉద్యోగాల పేరుతో మోసం చేసి అక్రమంగా తరలించడం, వ్యభిచారంలోకి నెట్టడం తీవ్రమైన నేరమని కోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ తీర్పు ద్వారా స్పష్టమైన సందేశం వెళ్లిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

