Dasara : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో ముగిశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
పది రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో 15 లక్షల మందికి పైగా భక్తులు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందడం సంతోషకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రంగా మారింది. ఉత్సవాలను ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసేలా నిర్వహించేందుకు అధికారులు, ఆలయ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు సమన్వయంతో పనిచేయడం అభినందనీయమని సీఎం ప్రశంసించారు.
అన్నప్రసాద సేవలో సమష్టి కృషి.. మెరుగైన ఏర్పాట్లు
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దాదాపు 8 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించడం అమ్మవారి సేవలో సమష్టి కృషికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దర్శన ఏర్పాట్లు, క్యూలైన్లు, ఇతర సౌకర్యాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించడం సానుకూల ఫలితాలను ఇచ్చిందన్నారు. గతంతో పోలిస్తే అమ్మవారి దర్శనానికి పట్టే సమయం తగ్గడంతో పాటు సేవల నాణ్యత కూడా పెరగడం సంతోషకరమని తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రముఖ ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, సంప్రదాయాలు మరియు ఆధ్యాత్మిక విలువలను కాపాడేలా ఉత్సవాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

