August : ఆగస్టు నెలను తెలంగాణ రాష్ట్ర సంక్షేమ మరియు అభివృద్ధి మాసంగా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15వ తేదీన ప్రజాపాలన పథకాల విస్తరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
ఇందులో భాగంగా కొత్త పెన్షన్లు, నూతన రేషన్ కార్డుల పంపిణీతో పాటు మరో 5 లక్షల మంది లబ్ధిదారులకు రూ.500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా ‘గృహ జ్యోతి’ పథకం కింద అదనంగా 4 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు. పేదలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

వైద్యరంగంలో మైలురాయి మరియు భవిష్యత్ ప్రాజెక్టులు
ఆగస్టు 15న సంక్షేమ పథకాలతో పాటు వైద్య, మౌలిక వసతుల రంగానికి సంబంధించి కీలక పురోగతి సాధించనున్నారు. నగర ప్రజలకు మెరుగైన ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు సనత్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన ‘టిమ్స్’ (TIMS – తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనెస్) ఆసుపత్రి సేవలను సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి తోడు రాజధాని నగర ముఖచిత్రాన్ని మార్చే మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు (Musi Riverfront Development) మరియు ప్రతిష్టాత్మక ‘ఫ్యూచర్ సిటీ’ ప్రణాళికలపై ప్రభుత్వం నుంచి కీలక ప్రకటనలు వెలువడే అవకాశముంది.

