Samsung Credit Card: గ్లోబల్ టెక్ దిగ్గజం శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ (Samsung Electronics) అమెరికా ఫైనాన్షియల్ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేసింది.
ప్రముఖ అంతర్జాతీయ బ్యాంక్ బార్‌క్లేస్ (Barclays) మరియు డిజిటల్ పేమెంట్స్ నెట్‌వర్క్ వీసా (Visa) భాగస్వామ్యంతో తమ మొట్టమొదటి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ 'శామ్‌సంగ్ గెలాక్సీ కార్డ్' (Samsung Galaxy Card) ను సోమవారం అధికారికంగా ప్రారంభించింది. అమెరికా పేమెంట్స్ మార్కెట్‌లో ఆపిల్ పే (Apple Pay / Apple Card) ఆధిపత్యానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా శామ్‌సంగ్ ఈ క్రెడిట్ కార్డ్‌ను రేసులోకి తెచ్చింది.
శామ్‌సంగ్ వాలెట్ ద్వారానే నిర్వహణ – ఆఫర్లు ఇవే

ఈ క్రెడిట్ కార్డ్ ప్రత్యేకత ఏంటంటే.. వినియోగదారులు అప్లై చేయడం నుంచి, ఖాతా నిర్వహణ, ఖర్చుల ట్రాకింగ్ మరియు రివార్డుల విముక్తి (Redemption) వరకు ప్రతి ఒక్కటి ‘శామ్‌సంగ్ వాలెట్’ (Samsung Wallet) యాప్ ద్వారానే నిర్వహించవచ్చు. శామ్‌సంగ్ ఉత్పత్తుల కొనుగోలుపై వినియోగదారులకు నేరుగా 5% క్యాష్‌బ్యాక్ దక్కనుంది. శామ్‌సంగ్ పే ద్వారా జరిపే లావాదేవీలతో పాటు ఇతర కేటగిరీ ఖర్చులపై ప్రత్యేక రివార్డు పాయింట్లు లభిస్తాయి. భౌతిక వాలెట్ల కంటే మొబైల్ ఆధారిత ఫైనాన్షియల్ సర్వీసెస్ వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్న తరుణంలో ఈ సీమ్‌లెస్ పేమెంట్స్ ఆఫర్ చేస్తున్నట్లు బార్‌క్లేస్ కార్డ్స్ హెడ్ డౌగ్ విల్లోన్ వెల్లడించారు.
Samsung Credit Card: అమెరికా ఇళ్లలో శామ్‌సంగ్ ఆధిపత్యం – బార్‌క్లేస్ వ్యూహం
అమెరికాలో దాదాపు 70% గృహాల్లో కనీసం ఒక శామ్‌సంగ్ పరికరం ఉందని, 30% ఇళ్లలో మూడు లేదా అంతకంటే ఎక్కువ శామ్‌సంగ్ ఉత్పత్తులు ఉన్నాయని శామ్‌సంగ్ నార్త్ అమెరికా ఫిన్‌టెక్ హెడ్ సి లీ తెలిపారు. బార్‌క్లేస్‌తో ఈ భాగస్వామ్యం కేవలం క్రెడిట్ కార్డ్‌కే పరిమితం కాదని, భవిష్యత్తులో మరిన్ని డిజిటల్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి తెస్తామని శామ్‌సంగ్ స్పష్టం చేసింది. అమెరికా కన్జ్యూమర్ బిజినెస్‌ను విస్తరిస్తున్న బార్‌క్లేస్.. గతంలో జనరల్ మోటార్స్ (GM) క్రెడిట్ కార్డ్ బిజినెస్‌ను దక్కించుకోగా, ఇప్పుడు శామ్‌సంగ్ టై-అప్‌తో అమెరికా క్రెడిట్ కార్డ్ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

