Peddi Sudarshan Reddy : తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తనదైన ముద్ర వేసిన నర్సంపేట మాజీ శాసనసభ్యుడు, బిఆర్ఎస్ (BRS) సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు.
సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని దర్శించి, ఆయన కుటుంబ సభ్యులను మరియు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఓదార్చారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో మొదటి నుంచి తనతో కలిసి నడిచిన ఒక ఆప్తమిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోవడం తనకు వ్యక్తిగతంగా ఎంతో తీరని లోటని కేసీఆర్ అత్యంత ఆవేదనతో పేర్కొన్నారు.

పెద్ది కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటన
తెలంగాణే శ్వాసగా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పెద్ది సుదర్శన్ రెడ్డి సాగించిన రాజకీయ ప్రస్థానం రాబోయే తరాలకు ఆదర్శప్రాయమని కేసీఆర్ కొనియాడారు. నీతి, నిజాయతీలకు నిలువుటద్దంగా నిలిచి ప్రజల ఆదరాభిమానాలను పొందిన ఆయన సేవలు చిరస్మరణీయమని గుర్తుచేసుకున్నారు. ఈ కష్టసమయంలో పెద్ది కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. అందులో భాగంగా, పెద్ది స్వప్నకు రూ. 10 లక్షల తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ పార్టీ తరఫున అన్ని విధాలా సాయమందిస్తామని పునరుద్ఘాటించారు.

