International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ప్రముఖ యోగా గురువు స్వామి రామ్‌దేవ్ బాబాతో కలిసి ఆయన ఈ వేడుకల్లో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని, ఇందుకోసం ప్రతి ఇంటికీ యోగాను తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

Read also: International Yoga Day: విజయవాడలో యోగా సందడి..బాబా రామ్‌దేవ్‌తో కలిసి యోగా చేసిన సీఎం చంద్రబాబు
ప్రతి గ్రామంలో శాశ్వత యోగా మందిరాలు.. ‘యోగాంధ్ర’ పోర్టల్ ప్రారంభం
ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే క్రమంలో భాగంగా, రాష్ట్రంలోని ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో శాశ్వత ప్రాతిపదికన యోగా మందిరాలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా, మండల స్థాయిల్లో ప్రత్యేక అధికారులకు అప్పగిస్తామన్నారు. అంతేకాకుండా, యోగాను డిజిటలైజ్ చేస్తూ ‘యోగాంధ్ర’ అనే ప్రత్యేక పోర్టల్‌ను తీసుకువస్తామని, నిపుణుల కమిటీ ద్వారా ప్రామాణిక యోగా పద్ధతులను ప్రజలకు అందుబాటులోకి ఉంచుతామని హామీ ఇచ్చారు.
ప్రధాని మోదీ, రామ్‌దేవ్ బాబాలపై ముఖ్యమంత్రి ప్రశంసల జల్లు
యోగాకు అంతర్జాతీయంగా 190 దేశాల్లో విశేష గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదేనని చంద్రబాబు కొనియాడారు. ప్రధాని మోదీ దార్శనికతతో భారతదేశం ప్రపంచానికి ‘విశ్వగురువు’గా మారుతోందని పేర్కొంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, యోగాను సామాన్యుడి దరికి చేర్చడంలో రామ్‌దేవ్ బాబా చేసిన కృషి అనన్యసామాన్యమైనదని ప్రశంసించారు.
ఆగస్టు 15 నుంచి ‘సంజీవని’ ప్రాజెక్ట్.. వచ్చే ఏడాది తిరుపతిలో వేడుకలు
ఆధ్యాత్మికత, నిత్య యోగా సాధన ద్వారానే ‘హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నొక్కిచెప్పారు. ప్రజలు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. రాబోయే ఆగస్టు 15 నుండి రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ ప్రాజెక్టును ప్రారంభిస్తామని, అందులో యోగాను ఒక ముఖ్య భాగం చేస్తామని వెల్లడించారు. అలాగే, వచ్చే ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఒక గంట సమయాన్ని యోగా, ధ్యానానికి కేటాయిస్తే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరమే ఉండదని సీఎం హితవు పలికారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
అసలు సాయికృష్ణ బతికున్నాడా ? చనిపోయాడా ? ప్రభుత్వానికి పేర్ని నాని డిమాండ్

