Actress Shakeela : ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేమ్ షకీలా తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. గత కొంతకాలంగా మెడ నొప్పితో బాధపడుతున్న ఆమెకు వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స (సర్జరీ) నిర్వహించారు.
నిత్యం గంటల తరబడి మంచంపై పడుకుని మొబైల్ ఫోన్ చూడటం వల్లే తన మెడపై తీవ్రమైన ప్రభావం పడిందని, అది క్రమంగా నరాలపై ఒత్తిడి పెంచి తీవ్ర నొప్పులకు దారితీసిందని షకీలా స్వయంగా వెల్లడించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.

రూ. 3 లక్షలతో సర్జరీ: ప్రస్తుతం సురక్షితంగా కోలుకుంటున్న నటి
ఈ శస్త్రచికిత్స కోసం దాదాపు రూ. 3 లక్షల వరకు ఖర్చయిందని తెలిపిన షకీలా, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. సర్జరీ విజయవంతంగా ముగియడంతో తాను త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుంటానని అభిమానులకు ధైర్యం చెప్పారు. తెలుగుతో పాటు అనేక దక్షణాది భాషల్లో వందలాది చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షకీలా త్వరగా కోలుకోవాలని, మొబైల్ ఫోన్ల మితిమీరిన వాడకం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అభిమానులు, నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

