Harish Vs Ponguleti : బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు చేసిన 'పొంగులూటీ' వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హరీష్ రావును ‘అగ్గిపెట్టెరావు’ అని సంబోధిస్తూ, పదవులు మరియు పైసల కోసం ఆయన ఎంత నీచానికైనా దిగజారుతారని ఘాటుగా విమర్శించారు. “ఓం.. భీమ్.. బుష్.. హరీష్..” అంటూ చమత్కరిస్తూనే, ఆయనపై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఇంటి వద్ద జరిగిన క్షుద్రపూజల నుంచి పాల వ్యాపారం పేరుతో సాగించిన అక్రమాల వరకు హరీష్ రావు అన్ని రకాల అవలక్షణాలకు నిలయంగా మారారని మండిపడ్డారు.

ధరణి అక్రమాలు వెలికితీస్తాం: పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వెనక్కి తగ్గేది లేదని, గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ పేరుతో జరిగిన వేల కోట్ల రూపాయల భూ దోపిడీని కచ్చితంగా బయటకు తీసి తీరుతామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. హరీష్ రావు తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా అసలు విషయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించలేరని పేర్కొన్నారు. ధరణి అక్రమాల్లో భాగస్వాములైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, త్వరలోనే అన్ని ఆధారాలతో ప్రజాక్షేత్రంలో అక్రమార్కుల ముసుగు తొలగిస్తామని మంత్రి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

