Operation Sindoor : మాతృభూమి రక్షణే ధ్యేయంగా సరిహద్దుల్లో శత్రువులతో పోరాడి వీరమరణం పొందిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్‌కు కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించింది.
జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’లో అమరుడైన శ్రీసత్యసాయి జిల్లా, గొరంట్ల మండలం కళ్లితండాకు చెందిన మురళీ నాయక్ (851 లైట్ రెజిమెంట్) పేరును ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం (నేషనల్ వార్ మెమోరియల్) వద్ద గల ప్రత్యేక శిలాఫలకంపై శాశ్వతంగా లిఖించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకునే త్యాగ చక్ర గోడలపై ఆయన పేరును చెక్కడంతో పాటు, నేషనల్ వార్ మెమోరియల్ అధికారిక వెబ్‌సైట్‌లోని ‘రోల్ ఆఫ్ ఆనర్’ లోనూ ఆయన వివరాలను పొందుపరిచారు. ఈ అరుదైన గౌరవం ద్వారా దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు అత్యున్నత త్యాగం చేసిన ఈ యువ వీరుడి పేరు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.
మాతృభూమి రక్షణలో అత్యున్నత త్యాగం.. దేశం గర్వించే వీరుడు
కేవలం 25 ఏళ్ల ప్రాయంలోనే సైన్యంలో చేరి, అంకితభావంతో విధి నిర్వహణ చేస్తూ మురళీ నాయక్ దేశం కోసం సర్వస్వం అర్పించారు. గతేడాది జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు శత్రువుల స్థావరాలపై జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’ వ్యూహాత్మక చర్యల అనంతరం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వద్ద పాకిస్తాన్ సైన్యం జరిపిన భారీ కాల్పులను ఎదుర్కొంటూ, తన పోస్ట్‌ను వీడకుండా ధైర్యంగా పోరాడి మురళీ నాయక్ తీవ్రంగా గాయపడి అమరుడయ్యారు. ఒక సాధారణ గిరిజన ప్రాంతం నుండి దేశాన్ని రక్షించే సైనికుడిగా ఎదిగి, అత్యంత సాహసోపేతమైన పోరాటాన్ని ప్రదర్శించిన ఈ జవాన్ త్యాగం వృధా పోలేదు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈ అమర గౌరవం ఆయన కుటుంబానికే కాకుండా, యావత్ ఆంధ్రప్రదేశ్‌కు మరియు దేశ ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తోంది.

