Godavarikhani: పాఠాలు చెప్పాల్సిన గురువే కామంతో కళ్ళు మూసుకుపోయి విద్యార్థిని ప్రాణం తీసిన దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వెలుగు చూసింది.
మంచిర్యాల జిల్లా నస్పూర్ పాలిటెక్నిక్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న జెట్టి నవీన్, అదే కళాశాలలో చదువుతున్న తాండ్ర అక్షితరాణిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లై భార్యకు దూరంగా ఉంటున్న నవీన్, అక్షితతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఈ విషయం ఊర్లో తెలియడంతో అక్షిత కుటుంబం గోదావరిఖనికి వలస వెళ్ళింది.

స్పై యాప్ ద్వారా నిఘా మరియు అనుమానం
డిప్లొమా పూర్తి చేసిన అక్షిత హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో శిక్షణ కోసం గోదావరిఖని సింగరేణి గనికి వచ్చిన ఆమెకు, ఓవర్‌మెన్ బొమ్మకంటి రవికుమార్‌తో పరిచయం ఏర్పడింది. అయితే, అక్షిత ఫోన్‌లో ముందే స్పై యాప్ ఇన్‌స్టాల్ చేసిన నవీన్, ఆమె కదలికలను రహస్యంగా గమనించేవాడు. రవికుమార్‌తో అక్షిత చనువుగా ఉండటాన్ని చూసి ఓర్వలేకపోయిన నవీన్, ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
Peddapalli: గడ్డి మందు తాగించి ఆత్మహత్యగా చిత్రీకరణ
రవికుమార్‌పై కక్ష తీర్చుకోవడానికి నవీన్ పక్కా ప్లాన్ వేసాడు. ఈ నెల 12న అక్షితను కారులో తిప్పుతూ గొడవపడ్డాడు. రవికుమార్‌పై కేసు పెట్టాలంటే నాటకం ఆడాలని నమ్మించి ఆమెతో బలవంతంగా గడ్డి మందు తాగించాడు. అంతేకాకుండా, రవికుమార్ వేధింపుల వల్లే తాను చనిపోతున్నట్లు ఆమె చేత ఒక లేఖ రాయించి ఫొటో తీసుకున్నాడు. అక్షిత అపస్మారక స్థితికి చేరుకున్నాక ఆమె తండ్రికి ఫోన్ చేసి ఇంటి వద్ద వదిలి వెళ్ళాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్షిత 13న ప్రాణాలు కోల్పోయింది.
సాంకేతిక ఆధారాలతో అడ్డంగా దొరికిన నిందితుడు
మొదట అక్షిత ఫోన్ లోని సూసైడ్ నోట్ ఆధారంగా రవికుమార్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ పుటేజీలు మరియు కాల్ డేటాను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నవీన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. తానే హత్య చేసినట్లు నిందితుడు నవీన్ అంగీకరించడంతో, ప్రధాన నిందితుడు నవీన్‌తో పాటు రవికుమార్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

