Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కక్షగట్టి వ్యవహరిస్తోందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
శనివారం రాజధాని ప్రాంతంలో వైసీపీ నేతలు చేసిన పర్యటన పూర్తిగా రెచ్చగొట్టేలా ఉందన్నారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే, రైతులపైకి దండయాత్రలా వెళ్లి దాడులకు తెగబడుతున్నారని ఆయన శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. వైసీపీ దుష్ట ఆలోచనలకు ఈ రాళ్ల దాడే నిదర్శనమని విమర్శించారు.
YSRCP Attack on Amaravati
ప్రజావేదిక కూల్చివేత నుంచి రాళ్ల దాడి వరకు.. అంతా విధ్వంసమే!
గత జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రజావేదిక కూల్చివేతతోనే మొదలైందని, నాటి నుంచి నేటి వరకు ఆ పార్టీది విధ్వంసకర వైఖరేనని నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. మూడు రాజధానుల ముసుగులో గత ఐదేళ్లు రాజధాని రైతులను నట్టేట ముంచారని, ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించినా ఇంకా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు సరికొత్త పేర్లతో డ్రామాలు ఆడుతూ హాస్యాస్పదంగా మారుతున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తోందని, భవనాలు, రహదారుల పనులు చురుగ్గా సాగడం చూసి వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. రాజధానిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, అలజడి సృష్టించేందుకు పన్నుతున్న కుట్రలను ప్రజలు తప్పక తిప్పికొడతారని మనోహర్ హెచ్చరించారు.
Read hindi news : hindi.vaartha.com

