Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అన్నం వండే ముందు బియ్యం కడగడంపై నిపుణుల విశ్లేషణ

అన్నం వండే ముందు బియ్యం కడగడంపై నిపుణుల విశ్లేషణ

వార్త 2 weeks ago

Washing Rice Before Cooking: భారతీయ ఇళ్లలో అన్నం వండటానికి ముందు బియ్యాన్ని కడగడం అనేది తరతరాలుగా వస్తున్న ఒక సాధారణ అలవాటు. అయితే, ఇలా చేయడం వల్ల లాభాలు ఉన్నాయా లేక నష్టాలు జరుగుతున్నాయా అనే అంశంపై ఆహార నిపుణులు మరియు శాస్త్రవేత్తలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

బియ్యాన్ని కడగడం వల్ల అన్నం ముద్దగా కాకుండా పొడిపొడిగా రావడంతో పాటు, రసాయన కాలుష్య కారకాలు తొలగిపోతాయని.. అదే సమయంలో కొన్ని రకాల పోషకాలు నష్టపోయే ఛాన్స్ కూడా ఉందని వారు పేర్కొంటున్నారు.

మైక్రోప్లాస్టిక్స్, ఆర్సెనిక్ ముప్పు తగ్గుతుంది!

ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ అడిలైడ్ యూనివర్సిటీకి చెందిన ఆహార శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. బియ్యం కడగడం వల్ల దానిపై ఉండే అదనపు పిండి పదార్థం (స్టార్చ్) తొలగిపోతుంది. దీనివల్ల అన్నం వండినప్పుడు గింజలు ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా వస్తాయి.

దీనితో పాటు, పంట సాగు సమయంలో నీరు మరియు నేల ద్వారా బియ్యానికి చేరే ‘ఆర్సెనిక్’ వంటి ప్రమాదకర రసాయనాలు కడగడం వల్ల చాలా వరకు శుభ్రపడతాయని ప్రముఖ ఫుడ్ సైంటిస్ట్ పర్మల్ డియో తెలిపారు. 2021లో జరిగిన ఒక శాస్త్రీయ అధ్యయనం ప్రకారం, వండటానికి ముందు బియ్యాన్ని కడగడం వల్ల అందులో ఉండే మైక్రోప్లాస్టిక్స్ (సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు) 20 నుండి 40 శాతం వరకు తగ్గుతాయని రుజువైంది.

పోషకాలు నష్టపోతామా? నిపుణుల సమాధానం ఇదీ..

అయితే, బియ్యాన్ని ఎక్కువగా నానబెట్టి, పదే పదే కడగడం వల్ల అందులో ఉండే ఐరన్, కాపర్, జింక్ వంటి నీటిలో కరిగే కొన్ని ముఖ్యమైన ఖనిజ లవణాలు (Minerals) నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాకపోతే, రోజువారీ జీవితంలో సమతుల్య ఆహారం (Balanced Diet) తీసుకునే వారికి ఈ చిన్నపాటి పోషకాల నష్టం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని డైటీషియన్ ఇవాంజెలిన్ మాంట్జియోరిస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న బియ్యం ఇప్పటికే మిల్లుల్లో శుద్ధి అయ్యి వస్తుండటం వల్ల.. కేవలం రుచి మరియు పైన ఉండే ధూళి, కెమికల్స్ వదిలించుకోవడానికే కడగాల్సి ఉంటుందని శాస్త్రవేత్త బో వాంగ్ వివరించారు.

బియ్యాన్ని ఎలా కడగాలి? శాస్త్రీయ పద్ధతి ఏంటి?

ఆహార శాస్త్రవేత్తల సలహా ప్రకారం.. బియ్యంలోని పోషకాలు పోకుండా ఉండాలంటే ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే సున్నితంగా కడగడం మంచిది. ఇలా చేయడం వల్ల పోషకాల నష్టం చాలా స్వల్పంగా ఉంటుంది.

ఒకవేళ మీరు వండే బియ్యంలో ఆర్సెనిక్ లేదా పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన ఉంటే.. బియ్యాన్ని కడిగిన తర్వాత ఎక్కువ నీరు పోసి ఉడికించి, గంజిని వార్చివేయడం (Drain method) ఉత్తమమైన మార్గం. ఈ పద్ధతి ద్వారా బియ్యంలోని ఆర్సెనిక్ శాతాన్ని దాదాపు 40 నుండి 60 శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధనల్లో తేలింది.

కరివేపాకు వల్ల కలిగే ఆరోగ్య లాభాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha