Bhagyanagar Ganesh Utsav Samithi: వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులకు ఒక కీలక పిలుపునిచ్చింది. తెలంగాణవ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్ని గణేశ్ మండపాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, 'వందేమాతరం' గీతాన్ని ఆలపించాలని సూచించింది.
బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన వందేమాతరం గీతం 150 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని, సెప్టెంబర్ 17న ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించాలని సమితి స్పష్టం చేసింది.
మూసాపేట్‌లోని పుల్లారెడ్డి పాఠశాలలో సోమవారం ఉత్సవ సమితి అధ్యక్షుడు జి. రాఘవ రెడ్డి అధ్యక్షతన ఒక కీలక సమావేశం జరిగింది. ఈ భేటీకి రాష్ట్రంలోని 32 కేంద్రాల నుంచి 64 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ మాట్లాడుతూ.. యువతలో దేశభక్తిని పెంపొందించడం, సాంస్కృతిక విలువలను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అలాగే యువతరానికి సనాతన ధర్మంపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కుల వివక్షను రూపుమాపి, హిందూ ఐక్యతను బలోపేతం చేసేందుకు సంత్ రవిదాస్ 650వ జయంతిని, అలాగే సామాజిక చైతన్యం కోసం అశోక్ సింఘాల్ జయంతిని వైభవంగా నిర్వహించాలని ఉత్సవ సమితి సూచించింది.
Read Also: Telangana IAS officers: తెలంగాణలో 10 జిల్లాలకు స్పెషల్ IAS ఆఫీసర్లు!
‘Vande Mataram’ at all Ganesh pandals… Call by Bhagyanagar Utsav Samithi!
Bhagyanagar Ganesh Utsav Samithi: డీజే సంస్కృతికి దూరం.. ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్
ఉత్సవాల ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని, పండుగపై జరిగే దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని నిర్వాహకులకు సమితి దిశానిర్దేశం చేసింది. మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, స్థానిక సంస్థల ద్వారా నిధులు కేటాయించడంతో పాటు పోలీసుల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో యువత డీజే సంస్కృతికి దూరంగా ఉండాలని, దేశభక్తిని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించే భజన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 14న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 25న నిమజ్జన మహోత్సవం జరగనుంది. హైదరాబాద్‌లో అత్యంత సుప్రసిద్ధమైన ఖైరతాబాద్ గణేశ్ ఈసారి 69 అడుగుల భారీ ఎత్తులో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి ‘పంచముఖ సంకటహర మహా గణపతి’ రూపంలో కొలువుదీరనున్నట్లు ఉత్సవ సమితి ప్రతినిధులు వెల్లడించారు.
Epaper: epaper.vaartha.com

