Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తెలుగు ప్లేయర్ శ్రీకర్ భరత్

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తెలుగు ప్లేయర్ శ్రీకర్ భరత్

వార్త 1 week ago

KS Bharat Retirement: టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్, ఆంధ్రప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్ కోన శ్రీకర్ భరత్ (కేఎస్ భరత్) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

32 ఏళ్ల భరత్ గురువారం సోషల్ మీడియా ద్వారా తన వీడ్కోలు నిర్ణయాన్ని వెల్లడించి క్రికెట్ అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశారు.

 TeamIndia

“భారతదేశం తరఫున అంతర్జాతీయ వేదికపై ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవంగా భావిస్తున్నాను. ఎంతో తృప్తిగా, గర్వంగా, కృతజ్ఞతాభావంతో అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకుంటున్నాను” అని భరత్ తన భావోద్వేగ పోస్ట్‌లో పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా క్రికెటర్ కావాలనే తన కలను నిజం చేయడంలో వెన్నుముకగా నిలిచిన కుటుంబ సభ్యులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Read also: Pandya brothers: పాండ్య సోదరుల మధ్య గొడవలు నిజమేనా?

నాగ్‌పూర్ టెస్టులో ఎంట్రీ.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన రికార్డు

స్టార్ కీపర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో, 2023 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన నాగ్‌పూర్ టెస్టు ద్వారా కేఎస్ భరత్ భారత జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. తన కెరీర్‌లో మొత్తం 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఈ ఆంధ్రా బ్యాటర్.. 20.09 సగటుతో 221 పరుగులు చేశారు. టెస్టుల్లో ఆయన వ్యక్తిగత అత్యధిక స్కోరు 44 పరుగులు.

లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లోనూ భరత్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2024 ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో తన సొంతగడ్డ అయిన విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌నే ఆయన కెరీర్‌లో చివరి అంతర్జాతీయ టెస్టు కావడం గమనార్హం.

KS Bharat Retirement: ఐపీఎల్ ప్రయాణం ఇలా..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లోనూ కేఎస్ భరత్ పలు జట్లకు ప్రాతినిధ్యం వహించారు. 2015 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్) జట్టు భరత్‌ను రూ.10 లక్షల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT), మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్ల తరఫున ఆయన ఐపీఎల్ బరిలోకి దిగారు.

రంజీల్లో ట్రిపుల్ సెంచరీ హీరో.. బాల్ బాయ్ నుండి బ్లూ జెర్సీ వరకు

విశాఖపట్నంలో జన్మించిన కేఎస్ భరత్ దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రా జట్టుకు నమ్మకమైన పిల్లర్‌గా నిలిచారు. 2015 రంజీ ట్రోఫీలో త్రిశతకం (Triple Century) బాదడం ద్వారా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన భారతదేశపు మొట్టమొదటి వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించారు.

ఆయన జీవితంలో మరో ఆసక్తికరమైన మధుర జ్ఞాపకం కూడా ఉంది. 2005లో పాకిస్తాన్‌పై మహేంద్ర సింగ్ ధోని 148 పరుగులతో విధ్వంసం సృష్టించిన విశాఖ వన్డే మ్యాచ్‌లో కేఎస్ భరత్ బాల్ బాయ్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత తానే జాతీయ జట్టుకు కీపర్‌గా ఎదగడం విశేషం. అయితే, భారత జట్టులో స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొనడం, యువ ఆటగాళ్ల రాకతో భరత్‌కు అంతర్జాతీయ స్థాయిలో పరిమిత అవకాశాలు మాత్రమే లభించాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha