AP EAPCET 2026 Results: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారవుతోంది.
జూన్ 30వ తేదీ లోపు ఈ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎప్‌సెట్ ఛైర్మన్, జేఎన్‌టీయూకే వైస్ ఛాన్సలర్ సీఎస్‌ఆర్కే ప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. మే 12 నుంచి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ప్రస్తుతం లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also : Saibaba : సాయిబాబా భక్తులకు మంత్రి ఆనం క్షమాపణలు
JNTUK Key Announcement on AP EAPCET 2026 Result
AP EAPCET 2026 Results: ఫలితాల ప్రకటన ఆలస్యానికి గల కారణాలు
నిజానికి అధికారిక షెడ్యూల్ ప్రకారం ఈఏపీసెట్ ఫలితాలు జూన్ 1 నాటికే విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ఎప్‌సెట్ ర్యాంకుల నిర్ణయంలో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ ఫలితాల ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు అధికారులు వేచి చూడాల్సి వచ్చింది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ ఇంటర్ విద్యార్థులకు మార్కులు మెరుగుపరుచుకునేందుకు ఇంప్రూవ్‌మెంట్ (అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ) పరీక్షల అవకాశం కల్పించింది. దీనివల్ల విద్యార్థుల మార్కుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉండటంతో, ఎవరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫలితాల విడుదలను వాయిదా వేసింది.
మరోవైపు, ఈ ఏడాది సుమారు 8 వేల మంది సీబీఎస్‌ఈ విద్యార్థులు కూడా ఏపీ ఈఏపీసెట్ పరీక్ష రాశారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి సమాధాన పత్రాల వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ ఫలితాలను జూన్ 21 నాటికే బోర్డు 85 శాతానికి పైగా విడుదల చేసింది. మిగిలిన దరఖాస్తుల ఫలితాలు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ సీబీఎస్‌ఈ రీ-ఎవాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగిసిన వెంటనే ఈఏపీసెట్ ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగకూడదు: మంత్రి నారా లోకేశ్
ఫలితాల విడుదల వారం రోజులు ఆలస్యమైనా పరవాలేదు కానీ, సాంకేతిక కారణాల వల్ల ఒక్క విద్యార్థి కూడా నష్టపోకూడదని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. మంత్రి సూచనల మేరకు పూర్తి పారదర్శకంగా, పక్కాగా ర్యాంకులను కేటాయించేందుకు ఎప్‌సెట్ కమిటీ కసరత్తు చేస్తోంది. జూన్ 30న ఫలితాలు విడుదలైన వెంటనే, విద్యార్థుల ర్యాంకులతో పాటు కౌన్సెలింగ్ షెడ్యూల్‌పై కూడా స్పష్టత రానుంది.

