APSRTC recruitment 2026: 7,673 ఉద్యోగాల భర్తీకి కసరత్తుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) కీలక నిర్ణయాలకు సిద్ధమైంది.
సంస్థలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 7,673 రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి చర్యలు ప్రారంభించింది. డ్రైవర్‌లు, కండక్టర్లు, మెకానిక్లు, శ్రామిక్‌లతో పాటు ఇతర విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నియామకాలకు సంబంధించి ఏపీఎస్‌ఆర్టీసీ పాలకమండలి సమావేశంలో తీర్మానం ఆమోదించి, రాష్ట్ర ప్రభుత్వ అనుమతికి పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే నియామక ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఉద్యోగాల భర్తీతో ఏపీఎస్‌ఆర్టీసీ సేవలు మరింత మెరుగుపడడంతో పాటు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.

అదే సమయంలో, సంస్థలో పనిచేస్తున్న ఆన్‌కాల్ డ్రైవర్లకు వేతన పెంపుకు కూడా పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు రూ.800గా ఉన్న ఆన్‌కాల్ డ్రైవర్ల వేతనాన్ని రూ.1000కి పెంచాలని నిర్ణయించారు. అలాగే, డబుల్ డ్యూటీ నిర్వహిస్తున్న కండక్టర్లకు ఇస్తున్న భత్యాన్ని కూడా పెంచి రోజుకు రూ.900గా నిర్ణయించారు.
ఈ నిర్ణయాలు ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా, పని ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని భావిస్తున్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యంలో, ఉద్యోగుల సంఖ్య పెరగడం, వేతనాలు మెరుగుపడటం ద్వారా రవాణా సేవలు మరింత సమర్థవంతంగా మారనున్నాయి.
ప్రభుత్వం త్వరలోనే ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని, అనంతరం నియామక ప్రక్రియకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
TG: సీఎం విదేశి పర్యటన.. మంత్రులు సమావేశంలో భట్టివిక్రమార్క ఏమన్నారంటే?

