Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అర్నబ్ తుపానుపై పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు స్పష్టమైన సూచనలు!

అర్నబ్ తుపానుపై పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు స్పష్టమైన సూచనలు!

వార్త 3 weeks ago

Pawan Kalyan: అర్నబ్ తీవ్ర తుపాను తీరం దాటిన నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

తుపాను ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు అధికారులందరూ క్షేత్రస్థాయిలోనే ఉండి సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. బాపట్ల నుంచి శ్రీకాకుళం వరకు తుపాను ప్రభావానికి గురైన అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం మధ్యాహ్నం ఆయన ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తూ, దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని సూచించారు.

కోనసీమ, పిఠాపురం ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

ఈ సమీక్షలో భాగంగా తుపాను తీవ్రంగా ప్రభావం చూపిన డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది పరిసరాలు మరియు కాకినాడ తీర ప్రాంతాలపై పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో నెలకొన్న పరిస్థితులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడ తీర ప్రాంతంలో దెబ్బతిన్న రహదారి మరియు కూలిపోయిన ఇళ్ల వివరాలను సేకరించారు. ప్రజల భద్రతకే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, తుపాను పూర్తిగా శాంతించిన తర్వాత పంట నష్టాన్ని అత్యంత పారదర్శకంగా అంచనా వేయాలని ఆదేశించారు. అలాగే చెరువుల గట్లు, వాగులు, వంకల వద్ద వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని దిశానిర్దేశం చేశారు.

Pawan Kalyan: గంటకు 140 కి.మీ. వేగంతో పెనుగాలుల బీభత్సం

అర్నబ్ తుపాను ప్రభావంపై అధికారులు ఉప ముఖ్యమంత్రికి క్షుణ్ణంగా వివరించారు. యానాంకు దక్షిణంగా అర్ధరాత్రి ప్రారంభమైన తుపాను తీరం దాటే ప్రక్రియ ఉదయం వరకు కొనసాగిందని తెలిపారు. ఈ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయని పేర్కొన్నారు. బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, అనకాపల్లి, విశాఖ, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో గాలుల విధ్వంసం అధికంగా ఉన్నట్లు నివేదించారు.

దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు… యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ

భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలు మరియు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 93 రోడ్లు దెబ్బతినగా, 736 చెట్లు నేలకూలినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం గాలుల తీవ్రత తగ్గిన ప్రాంతాల్లో రోడ్లపై పడిన చెట్లను తొలగించడం, విద్యుత్ పునరుద్ధరణ పనులు ప్రారంభించామని తెలిపారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత పునరావాస కేంద్రాల్లో ఉన్నారని, ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ల ద్వారా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్లు వివరించారు.

Epaper: epaper.vaartha.com

ఆంధ్రప్రదేశ్‌లో తుపాను సృష్టించిన విధ్వంసంలో ముగ్గురు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha