Chandrababu Naidu: బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్ణబ్' తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడమే ధ్యేయంగా ఆయన తన క్యాంపు కార్యాలయం నుండి ఉన్నతాధికారులు మరియు ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారులకు తగిన దిశానిర్దేశం చేస్తున్నారు.

తీరం దాటే ప్రాంతాలు, భారీ వర్షాల హెచ్చరిక
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా ప్రకారం, ‘అర్ణబ్’ తుపాను త్వరలోనే తీవ్ర తుపానుగా రూపాంతరం చెందనుంది. ఈ నెల 28వ తేదీన బాపట్ల-విశాఖ మధ్య యానాం వద్ద ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పలనాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ నెల 28, 29 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు. రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చేరవేయాలని సీఎం ఆదేశించారు.
Chandrababu Naidu: లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు.. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మోహరింపు
తుపాను ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, దివ్యాంగులు మరియు చిన్న పిల్లలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 4,711 మంది గర్భిణీలను సమీప ఆసుపత్రులకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో సహాయక చర్యల కోసం 7 ఎన్డీఆర్ఎఫ్, 8 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. ఎన్టీఆర్, విశాఖపట్నంలో అదనపు బలగాలను రిజర్వ్‌లో ఉంచడంతో పాటు మెరైన్ పోలీసులు, నేవీ, కోస్ట్‌గార్డ్ సేవలను కూడా వినియోగిస్తున్నారు.
వ్యవసాయం, మౌలిక వసతులు మరియు విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి
తుపాను వల్ల రైతులకు నష్టం వాటిల్లకుండా, కోత కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని వ్యవసాయ శాఖకు సీఎం సూచించారు. సుమారు 1.82 లక్షల హెక్టార్లలోని ఉద్యాన పంటలను కాపాడేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాకు ఎక్కడా అంతరాయం కలగకుండా సిబ్బందిని, సామగ్రిని సిద్ధం ఉంచాలన్నారు. ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. తుపాను గమనాన్ని బట్టి ప్రతి నాలుగు గంటలకొకసారి ప్రజలకు హెచ్చరికల బులెటిన్లు జారీ చేయాలని తెలిపారు. తుపాను తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

