Assembly Sessions : తెలంగాణ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సెషన్‌కు కూడా దూరంగా ఉండనున్నారని స్పష్టమైంది.
నిన్న ఎర్రవల్లిలోని తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమైన కేసీఆర్, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ స్వయంగా ప్రజాప్రతినిధులకు మార్గదర్శనం చేయడం ద్వారా తాను సభకు హాజరుకావడం లేదని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఆయన మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడితే ముఖ్యమంత్రి హోదాలోనే అడుగుపెడతారని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గతంలోనే స్పష్టం చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి, ముఖ్యమంత్రితో చర్చించే స్థాయిలో అసెంబ్లీ చర్చలు సాగడం లేదని, అందుకే కేసీఆర్ హాజరు కావాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.

ప్రతిపక్ష వైఖరిపై విమర్శలు: సభకు వచ్చి నిలదీయాలంటున్న కాంగ్రెస్
మరొకవైపు, కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలను చట్టసభలో లేవనెత్తాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉందని, ఏవైనా ప్రశ్నలు లేదా అభ్యంతరాలు ఉంటే అసెంబ్లీ వేదికగానే వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసురుతున్నారు. సభకు రాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ గైర్హాజరీపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుండటంతో, నేటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలు తీవ్ర ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంది.

