Assembly Session : తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వేళ రాజధాని హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలని, తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువత అసెంబ్లీ ముట్టడికి దిగారు.
పోలీసుల కన్నుగప్పి అసెంబ్లీ ప్రధాన గేటు వద్దకు చేరుకున్న నిరుద్యోగులు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నిరసన తెలుపుతున్న యువకులను అరెస్టు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించడంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు తీవ్ర అలజడి చెలరేగింది.

రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి: కాంగ్రెస్ హామీలపై నిరుద్యోగుల నిలదీత
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారమే నడుచుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. కొత్త జాబ్ క్యాలెండర్‌ను తక్షణమే ప్రకటించడంతో పాటు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని నినదించారు. ఏళ్లుగా ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని, కాలయాపన చేయకుండా నోటిఫికేషన్లు విడుదల చేయాలని స్పష్టం చేశారు. స్పష్టమైన ప్రణాళికతో ఉద్యోగ నియామకాలు చేపట్టి తమ భవిష్యత్తుకు భరోసా కల్పించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.

