ATF : ఏవియేషన్ ఇంధనంలో ఇథనాల్ కలపడంపై రామ్మోహన్ నాయుడు స్పష్టత ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)లో ఇథనాల్‌ను కలిపే ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
విమాన ఇంధనంలో కేంద్రం ఇథనాల్‌ను కలపాలని చూస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని, బాధ్యతారాహిత్యమైనవని ఖండించారు. సాధారణ ఇథనాల్‌కు మరియు విమానయానంలో వాడే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF)కు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉందని, ఈ రెండింటిని ఒకటిగా భావించి తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు.

ప్రయాణికుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం
విమాన భద్రతకు సంబంధించి ఇటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల విమాన ప్రయాణికుల్లో అనవసరమైన భయాలు, ఆందోళనలు నెలకొంటాయని మంత్రి హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతకే తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF) అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) ద్వారా ధృవీకరించబడి, అనేక కఠినమైన పరీక్షల తర్వాతే ఉపయోగంలోకి వస్తుందని స్పష్టం చేశారు. భద్రతా ప్రమాణాలకు విఘాతం కలిగించే ఎలాంటి నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకోదని తేల్చి చెప్పారు.
రైతుల కోసం కేంద్రం భారీ నిర్ణయం.. రూ.23,731 కోట్ల 'గోబర్‌ధన్' పథకం!

