Hyderabad Bonalu 2026 : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు (Bonalu Festivals) ఘనంగా ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో నాటు కోళ్లకు (Country Chicken) డిమాండ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది.
నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో సాగే ఈ ఉత్సవాలలో అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం, బంధుమిత్రులకు నాటు కోడి విందు వడ్డించడం ఇక్కడి ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో నాటు కోడి మాంసం ధరలు భారీగా పెరిగాయి. సాధారణ రోజుల్లో కిలో రూ. 350 నుండి రూ. 400 పలుకుతుండగా, ప్రస్తుతం బోనాల రద్దీ కారణంగా నాటు కోడి మాంసం ధర కిలో రూ. 500 నుండి ఏకంగా రూ. 650 వరకు చేరింది. ధర ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ, పండుగ సంబరాల్లో భాగంగా మాంసం ప్రియులు నాటు కోళ్ల కొనుగోళ్లకు ఎగబడుతున్నారు.

రికార్డు స్థాయిలో విక్రయాలు – వారాంతాల్లో పీక్‌కు చేరుతున్న అమ్మకాలు
హైదరాబాద్ వ్యాప్తంగా నాటు కోళ్ల అమ్మకాలు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరినట్లు వ్యాపారులు వెల్లడిస్తున్నారు. సాధారణ రోజుల్లో నగరంలో నాటు కోడి మాంసం వినియోగం సగటున రోజుకు 10,000 కిలోల వరకు ఉంటుంది. అదే వారాంతాల్లో (శని, ఆదివారాలు) ఈ డిమాండ్ 40,000 కిలోల వరకు పెరుగుతుంది. అయితే, ప్రస్తుతం బోనాల ఉత్సవాల సీజన్ నడుస్తుండటంతో అమ్మకాలు ఊహించని రీతిలో పెరిగి, రోజువారీ వినియోగం 50,000 కిలోల నుండి ఏకంగా 70,000 కిలోలకు చేరింది. నగరంలోని మురుగన్ మార్కెట్, జియాగూడ, సికింద్రాబాద్ తదితర ప్రధాన మార్కెట్లతో పాటు గల్లీల్లోని చికెన్ సెంటర్లు కూడా నాటు కోళ్ల కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.
ప్రజాకవి అందె రేవంత్ రెడ్డి ఘన నివాళులు.. ఘట్‌కేసర్‌లో 'స్మృతి వనం' పనులకు సీఎం శ్రీకారం!

