Char Dham Yatra: పవిత్ర చార్‌ధామ్ యాత్రకు భక్తుల తాకిడి ఊహించని రీతిలో పెరగడంతో బద్రీనాథ్ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా జోషీమఠ్ పరిధిలో దాదాపు 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.
దీంతో వేలాది మంది భక్తులు కొండ మార్గాల్లోనే గంటల తరబడి చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
CharDhamYatra
ఒకేసారి పెరిగిన రద్దీ.. స్తంభించిన విష్ణుప్రయాగ్
చార్‌ధామ్ యాత్రతో పాటు సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం హేమకుండ్ సాహిబ్ యాత్ర కూడా ఒకేసారి ప్రారంభం కావడంతో ఈ రహదారిపై వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా విష్ణుప్రయాగ్‌తో పాటు పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. శనివారం ఒక్కరోజే జోషీమఠ్ సమీపంలోని ‘జీరో బ్యాండ్’ వద్ద సుమారు 8 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇరుకైన ఘాట్ రోడ్లపై గంటల కొద్దీ నిలిచిపోవడంతో వృద్ధులు, పిల్లలు, మహిళలు ఆహారం, మంచినీరు దొరక్క అల్లాడిపోతున్నారు. చివరికి అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌లు కూడా ఈ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Char Dham Yatra: రంగంలోకి దిగిన పోలీసులు.. ‘గేట్ సిస్టమ్’ అమలు
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్థానిక యంత్రాంగం, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడానికి జోషీమఠ్ వద్ద ‘గేట్ సిస్టమ్’ (వన్-వే విధానాన్ని) ప్రవేశపెట్టారు. ప్రతి 30 నిమిషాలకు ఒకవైపు వాహనాలను మాత్రమే అనుమతిస్తూ రద్దీని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున, చార్‌ధామ్ వెళ్లే యాత్రికులు తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని మరియు పోలీసుల సూచనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించబోతున్నారా ..? కేంద్రమంత్రి క్లారిటీ !!

