Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలంగాణలో వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలంగాణలో వర్షాలు

వార్త 3 weeks ago

Telangana Rains: గత కొద్దిరోజులుగా భానుడి భగభగలు, ఉక్కపోతతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ప్రారంభం కావడంతో ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభించింది. ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

ఉత్తర, మధ్య జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు

ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. దీనికి తోడుగా బలమైన ద్రోణి కూడా కొనసాగుతోంది. ఈ రెండింటి ప్రభావం కారణంగా తెలంగాణలోని ఉత్తర, మధ్య జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్నిచోట్ల గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచే వర్షం కురిసింది.

Telangana Rains: పలు జిల్లాల్లో నమోదైన వర్షపాతం

నిన్న సాయంత్రం నుంచే రాష్ట్రంలోని వాతావరణంలో మార్పులు వచ్చాయి. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 4.3 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా చండూరులో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, సంగారెడ్డి, వికారాబాద్, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. నిన్న పగటిపూట నిజామాబాద్‌లో అత్యధికంగా 35.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ, రాత్రికి వాతావరణం చల్లబడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

రైతన్నల్లో చిగురిస్తున్న ఆశలు

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. దీనివల్ల వానాకాలం (ఖరీఫ్) సాగు పనులు కూడా మందగించాయి. అయితే ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడన వర్షాలు వ్యవసాయ పనులకు ఎంతో మేలు చేస్తాయని, ఎండిపోతున్న పంటలకు జీవం పోస్తాయని రైతాంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ జల్లులు ఎండల నుంచి ఉపశమనాన్ని ఇవ్వడమే కాకుండా, సాగు పనులు వేగవంతం కావడానికి ఊతమిస్తున్నాయి.

Epaper: epaper.vaartha.com

ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha