Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత భూభాగంలో చైనా అక్రమ నిర్మాణాలు!

భారత భూభాగంలో చైనా అక్రమ నిర్మాణాలు!

వార్త 4 days ago

India China Border Dispute: భారత్-చైనా సరిహద్దుల్లోని అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) మళ్లీ తన వక్రబుద్ధిని చాటుకుంటోంది.

వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన తక్చింగ్-మాజా ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడి చైనా సైన్యం అక్రమ నిర్మాణాలను చేపడుతున్నట్లు స్థానిక సామాజిక సంస్థ ‘నాహ్ వెల్ఫేర్ సొసైటీ’ సంచలన ఆరోపణలు చేసింది. ఈ అక్రమ కార్యకలాపాలపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ దాపోరిజో డిప్యూటీ కమిషనర్‌కు ఆ సంస్థ ఒక వినతిపత్రాన్ని సమర్పించింది. గత పదేళ్లుగా ఈ సరిహద్దు ప్రాంతాలలో చైనా సైన్యం నిరంతరం మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓయింగ్ (అసాఫిలా ప్రాంతం), పానియార్, మార్పాన్, పట్రాంగ్ సరస్సు మరియు టిండింగ్‌టాంగ్ వంటి కీలక ప్రాంతాల్లో చైనా సైనిక శిబిరాలను నిర్మిస్తోందని నాహ్ వెల్ఫేర్ సొసైటీ పేర్కొంది. దీనివల్ల స్థానిక గిరిజన తెగలకు చెందిన సంప్రదాయ పచ్చిక బయళ్లు, పూర్వీకుల వేట స్థలాలు మరియు వ్యవసాయ భూములు చైనా వశమవుతున్నాయని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం మరియు అరుణాచల్ సర్కార్ స్పందించి సరిహద్దులను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు.

Read Also: Venezuelans Earthquake: వెనిజులాలో వందకు పైగా గల్లంతు.. అమెరికా బహిష్కరణ జరిగిన కొన్ని గంటల్లోనే తీవ్ర విషాదం!

 India China Border Dispute

India China Border Dispute: 1962 నాటి యుద్ధ మార్గం.. గ్రామస్థులకు చైనా సైన్యం బెదిరింపులు

1962లో భారత్-చైనా యుద్ధం జరిగిన సమయంలో చైనా సైన్యం తూర్పు భారతదేశంలోకి చొరబడటానికి ఉపయోగించిన ప్రధాన మార్గాలలో ఈ మాజా ప్రాంతం ఒకటి. 1972 నుండి భారత సైన్యం ఇక్కడ శాశ్వత స్థావరాలను ఏర్పాటు చేసినప్పటికీ, చైనా సైనికులు తరచూ సరిహద్దులు దాటి వచ్చి స్థానిక పౌరులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బిడక్ గ్రామస్థులు తెలిపారు. భారత సైనిక శిబిరాల సమీపంలో నివసించే ప్రజలను ఆయా ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ చైనా సైన్యం బెదిరింపులకు పాల్పడుతోందని వారు ఆరోపించారు. దేశ భద్రతలో కీలక పాత్ర పోషించే సరిహద్దు గ్రామాలు నేటికీ కనీస సౌకర్యాలకు నోచుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో సరైన రహదారులు, మొబైల్ నెట్‌వర్క్, వైద్య సదుపాయాలు లేవు. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా మాజాను తక్చింగ్‌తో కలిపే రహదారి నిర్మాణం కూడా పెండింగ్‌లోనే ఉండిపోయింది. భద్రతా నిబంధనల వల్ల ఇక్కడ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీపై నిషేధం ఉండటంతో చైనా చేస్తున్న అక్రమాలను ప్రపంచానికి చూపించడానికి ఆధారాలు సేకరించడం కూడా కష్టంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చారిత్రాత్మక భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. 99 శాతం చర్చలు సక్సెస్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha