Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత పైలట్‌పై నెతన్యాహు ప్రశంసల వర్షం.. ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకలకు ఆహ్వానం

భారత పైలట్‌పై నెతన్యాహు ప్రశంసల వర్షం.. ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకలకు ఆహ్వానం

వార్త 2 weeks ago

Benjamin Netanyahu: విమానంలో సహ పైలట్ జరిపిన గొడ్డలి దాడిని తిప్పికొట్టి, వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ సాహసానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా కెప్టెన్ మచ్చర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయనను నిజమైన ‘హీరో’గా అభివర్ణించడంతో పాటు, ఇజ్రాయెల్ అత్యున్నత వేడుకకు ఆహ్వానించడం విశేషం. “మీరు ఇజ్రాయెల్, భారత్, యావత్ ప్రపంచానికి గర్వకారణమైన హీరో” అని నెతన్యాహు కొనియాడారు. ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘పవిత్ర జ్యోతిని వెలిగించే’ అరుదైన గౌరవానికి మచ్చర్‌ను మరియు ప్రధాని నరేంద్ర మోదీని ఆయన ఆహ్వానించారు. సాధారణంగా ఈ గౌరవం ఇజ్రాయెల్ పౌరులకు మాత్రమే దక్కుతుంది.

విమానంలో ఏం జరిగింది? భయానక ఘటన నేపథ్యం

గత సెప్టెంబర్ 30న దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా, ఒమన్‌కు చెందిన సహ పైలట్ హమామ్ అల్-హమామీ విమానాన్ని కూల్చివేసే దురుద్దేశంతో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై గొడ్డలితో హఠాత్తుగా దాడికి దిగాడు. ఈ దాడి కారణంగా విమానం కేవలం రెండు నిమిషాల్లోనే 17,000 అడుగుల కంటే కిందకు పడిపోయింది. దీంతో వెంటనే హైజాకింగ్ డిస్ట్రెస్ సిగ్నల్ పంపబడింది. సహ పైలట్ దాడిలో తీవ్ర గాయాలపాలైనప్పటికీ, కెప్టెన్ మచ్చర్ ఎక్కడా ధైర్యం కోల్పోకుండా తీవ్రంగా పోరాడారు. తన చివరి శక్తిని ఉపయోగించి కాక్‌పిట్ డోర్‌ను అన్‌లాక్ చేయడంతో, ప్రయాణికులు లోపలికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Benjamin Netanyahu: ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకున్న కెప్టెన్ మచ్చర్

ఫోన్ సంభాషణలో భాగంగా అసలు ఆ రోజు ఏం జరిగిందని నెతన్యాహు అడగ్గా, కెప్టెన్ మచ్చర్ ఆనాటి భీకర క్షణాలను వివరించారు. “సహ పైలట్ ప్రార్థన చేసుకుంటానని చెప్పి వెళ్లాడు. నేను గమనించని సమయంలో నా తల వెనుక భాగంలో బలమైన దెబ్బ తగిలింది. మొదట విమానంలో ఏదైనా సాంకేతిక లోపం అనుకున్నాను, కానీ వరుసగా దెబ్బలు తగలడంతో నాతో పాటు ఉన్నవ్యక్తే దాడి చేస్తున్నట్లు గ్రహించాను” అని తెలిపారు. “అతడిని నిలువరించడానికి ప్రయత్నించినా, తొలి దెబ్బలకే నా కంటిచూపు మందగించింది. డోర్ తెరవడానికి ప్రయత్నిస్తే అతను మూసేశాడు. కానీ నాలో చివరి పోరాట శక్తి మిగిలి ఉందనిపించి, శక్తి అంతా కూడగట్టుకుని డోర్ తెరిచాను” అని మచ్చర్ వెల్లడించారు.

తప్పిన పెను విపత్తు.. ప్రశంసించిన నెతన్యాహు

మచ్చర్ ధైర్యసాహసాలు విన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “అసాధ్యమైన పరిస్థితుల్లో మీరు చూపిన విచక్షణ, తెగువ నన్ను విస్మయపరిచాయి. మీ చొరవ వల్ల ఎంతో మంది ప్రాణాలు దక్కాయి” అని అభినందించారు. కెప్టెన్ మచ్చర్ సాహసం కారణంగా సరిగ్గా ‘9/11 తరహా పెను విపత్తు’ తప్పిందని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఈ క్లిష్టమైన సమయంలో అద్భుతమైన సంయమనం ప్రదర్శించిన పైలట్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha