Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్‌లో తొలిసారిగా 'బిగ్ బాష్ లీగ్' (BBL) మ్యాచ్

భారత్‌లో తొలిసారిగా 'బిగ్ బాష్ లీగ్' (BBL) మ్యాచ్

వార్త 2 weeks ago

Big Bash League: క్రికెట్ అభిమానులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రతిష్ఠాత్మక 'బిగ్ బాష్ లీగ్' (BBL) తొలిసారిగా భారత్‌లో అడుగుపెడుతోంది.

బీబీఎల్‌ 16వ సీజన్ ఆరంభ మ్యాచ్‌కు చెన్నైలోని ప్రఖ్యాత ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా నిలవనుంది. డిసెంబర్ 12న మెల్‌బోర్న్ రెనెగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ జట్ల మధ్య జరగనున్న ఈ చారిత్రక మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు ఇవాళ్టి నుంచే అధికారికంగా ప్రారంభమయ్యాయి.

భారత్‌లోని క్రికెట్ ప్రేమికుల కోసం ‘డిస్ట్రిక్ట్ బై జొమాటో’ (District by Zomato) వెబ్‌సైట్‌లో తొలి విడత టికెట్లను అందుబాటులో ఉంచారు. అభిమానుల డిమాండ్‌ను బట్టి మరిన్ని టికెట్లను విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరోవైపు, ఆస్ట్రేలియా నుంచి వచ్చే అభిమానుల కోసం ‘క్రికెట్ ఆస్ట్రేలియా ట్రావెల్ ఆఫీస్’ (CATO) ప్రత్యేకంగా అంతర్జాతీయ ట్రావెల్ ప్యాకేజీలను ప్రకటించింది.

Read Also : IND vs WI T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్

 ‘Big Bash League’ (BBL) match in India for the first time

Big Bash League: చెన్నైలో మ్యాచ్ నిర్వహణ వెనుక కథనం..

గత మే నెలలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కోసం ఐదుగురు సభ్యుల క్రికెట్ ఆస్ట్రేలియా (CA) ప్రతినిధి బృందం చెన్నైలో పర్యటించింది. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్‌తో కలిసి వారు మ్యాచ్‌ను వీక్షించారు. ఆ పర్యటనలోనే బీబీఎల్‌ ఆరంభ మ్యాచ్‌ను చెన్నైలో నిర్వహించాలని సీఏ ప్రతిపాదించగా, బీసీసీఐ ఇందుకు సానుకూలంగా స్పందించి అంగీకరించింది. కాగా, పెర్త్ స్కార్చర్స్ జట్టు బీబీఎల్‌ చరిత్రలో అత్యధికంగా ఆరుసార్లు టైటిల్ గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.

క్రికెట్ ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ అలిస్టర్ డాబ్సన్ స్పందన

ఈ చారిత్రక మ్యాచ్ గురించి క్రికెట్ ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్స్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ అలిస్టర్ డాబ్సన్ మాట్లాడుతూ.. కిక్కిరిసిన స్టేడియం మధ్య జరిగే మ్యాచే బీబీఎల్‌కు అసలైన అందమని, ఆ అద్భుతమైన అనుభూతిని చెన్నై ప్రేక్షకులకు అందించబోతున్నామని పేర్కొన్నారు. బ్యాటర్ల విధ్వంసం, మైదానంలో నాటకీయత, ప్రపంచ స్థాయి వినోదంతో అభిమానులకు ఇదొక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని తెలిపారు. డిసెంబర్ 12న జరిగే ఈ మ్యాచ్‌కు భారత్‌లో అపూర్వమైన స్పందన ఉంటుందని, స్టేడియం పూర్తిగా నిండిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రత్యక్ష ప్రసార వివరాలు

ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్‌ను సెవెన్ నెట్‌వర్క్, ఫాక్స్ క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా.. భారత్‌లోని కోట్లాది మంది క్రికెట్ అభిమానుల కోసం జియోస్టార్ (JioStar) ద్వారా లైవ్ టెలికాస్ట్ అందుబాటులో ఉండనుంది.

హోప్ సెంచరీ.. టీమిండియాపై విండీస్ సంచలన విజయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha