India vs Sri Lanka Series: క్రికెట్ అభిమానులకు సరికొత్త జోష్ ఇచ్చే వార్త. దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు సిద్ధమైంది.
ఆగస్టు నెలలో లంక వేదికగా ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-2027 సీజన్‌లో భాగంగా జరగనుందని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

ఆగస్టు 15 నుంచి టెస్ట్ సమరం: వేదికలు ఇవే!
శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం.. స్పిన్నర్లకు స్వర్గధామంగా భావించే గాలె అంతర్జాతీయ స్టేడియంలో ఆగస్టు 15 నుంచి 19 వరకు మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అనంతరం కొద్దిరోజుల విరామం తర్వాత, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని చారిత్రాత్మక సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) మైదానంలో రెండో టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ మ్యాచ్‌లు అన్నీ కూడా స్థానిక కాలమానం ప్రకారం ప్రతిరోజూ ఉదయం 10 గంటలకే ప్రారంభం కానున్నాయి.
India vs Sri Lanka Series: డబ్ల్యూటీసీ (WTC) పాయింట్ల పట్టికలో కీలకం
ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా 9 మ్యాచ్‌ల తర్వాత 48.15 విజయాల శాతంతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు శ్రీలంక జట్టు 44.44 విజయాల శాతంతో ఆరో స్థానంలో ఉంది. ఈ సిరీస్‌ను కైవసం చేసుకుని పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ వైపు దూసుకుపోవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.
భారత్ చివరిసారిగా 2017లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో శ్రీలంకలో పర్యటించింది. ఆ సారి లంకను వారి సొంత గడ్డపైనే 3-0 తేడాతో వైట్‌వాష్ చేసి టీమిండియా రికార్డు సృష్టించింది. మళ్లీ ఇన్నాళ్లకు టెస్ట్ సిరీస్ కోసం భారత్ అక్కడ అడుగుపెడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

