Bhadrachalam Road : తెలంగాణలోని చారిత్రాత్మక మరియు కీలకమైన రైల్వే స్టేషన్లలో ఒకటైన 'భద్రాచలం రోడ్డు' (Bhadrachalam Road) రైల్వే స్టేషన్ పేరును మార్చాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
ఈ మేరకు స్టేషన్ పేరును ‘కొత్తగూడెం’ లేదా ‘భద్రాద్రి కొత్తగూడెం’గా మార్చాలని కోరుతూ ప్రజాప్రతినిధులు అధికారికంగా తమ ప్రయత్నాలను ప్రారంభించారు. ఖమ్మం పార్లమెంటు సభ్యులు రఘురాం రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తదితరులు సికింద్రాబాద్‌లోని రైల నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ను కలిసి ఈ అంశంపై ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
కొత్తగూడెం ప్రాంతానికి వచ్చి వెళ్లే ప్రయాణికులకు :
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఈ రైల్వే స్టేషన్ విరాజిల్లుతున్నప్పటికీ, దీనిని ఇప్పటికీ నిజాం కాలం నాటి పేరును తలపించేలా ‘భద్రాచలం రోడ్డు’ (స్టేషన్ కోడ్: BDCR) అని పిలవడం జరుగుతోంది. అయితే, భద్రాచలం పట్టణం ఇక్కడికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో కొత్తగూడెం ప్రాంతానికి వచ్చి వెళ్లే ప్రయాణికులకు, స్థానికేతర యాత్రికులకు ఈ పేరు వల్ల గందరగోళం ఏర్పడుతోంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి క్షేత్రానికి వెళ్లే భక్తులు సాధారణంగా ఈ స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుండటంతో, ఇది భద్రాచలానికి సమీప మార్గంగా పేరుగాంచింది. కానీ, పరిపాలనాపరంగా ఇది కొత్తగూడెం పట్టణ పరిధిలోనే ఉంది.

ఈ ప్రాంతం సాంస్కృతికంగా, చారిత్రకంగా, అలాగే పారిశ్రామికంగా సింగరేణి బొగ్గు గనుల కేంద్రంగా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. జిల్లా కేంద్రం పేరు మీదుగానే రైల్వే స్టేషన్ పేరు కూడా ఉండాలనేది దశాబ్దాల కాలంగా స్థానిక ప్రజలు మరియు ప్రయాణికుల ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఇదే విషయాన్ని ఎంపీలు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా పేరు మారుస్తే ప్రాంతీయ గుర్తింపు మరింత పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం భారతీయ రైల్వే శాఖ చేపడుతున్న ‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’ (ABSS) కింద ఈ స్టేషన్‌కు కోట్లాది రూపాయలతో ఆధునిక హంగులు సమకూరుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యాల మెరుగుతో పాటు స్టేషన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో, దీని నామకరణాన్ని కూడా మర్రిస్తే మరింత సముచితంగా ఉంటుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఈ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి, త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటారని స్థానికులు ఆశిస్తున్నారు.

