Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భోగాపురం స్కూల్‌లో మంత్రి లోకేష్‌తో ధర్మేంద్ర ప్రధాన్ పర్యటన

భోగాపురం స్కూల్‌లో మంత్రి లోకేష్‌తో ధర్మేంద్ర ప్రధాన్ పర్యటన

వార్త 3 weeks ago

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంకేతిక విప్లవం, సమూల విద్యా సంస్కరణల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

మంగళవారం నాడు విజయనగరం జిల్లా భోగాపురం మండల కేంద్రంలోని ప్రతిష్టాత్మక 'పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్'ను (PM SHRI AP Model School Bhogapuram) కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో (Union Minister Dharmendra Pradhan) కలిసి మంత్రి లోకేష్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. పాఠశాలలో అమలు చేస్తున్న ఆధునిక డిజిటల్ విద్యా బోధన పద్ధతులను, మౌలిక వసతులను కేంద్ర, రాష్ట్ర మంత్రులు అత్యంత ఆసక్తిగా పరిశీలించారు.

ముందుగా పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌లకు ప్రిన్సిపాల్ సి.పార్వతి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్కూల్ ఎన్‌సీసీ విద్యార్థులు, పోలీసుల నుండి మంత్రులు గౌరవ వందనం స్వీకరించారు.

డ్యాష్ బోర్డు ప్రగతి - 'స్మార్ట్ కిచెన్' పై పైలట్ ప్రాజెక్ట్ విశ్లేషణ

పాఠశాల అంతటా కలియతిరిగిన మంత్రులు విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు. తొలుత ప్రాథమిక విద్యార్థుల కోసం రూపొందించిన 'జాదు పిఠారా' (Jadui Pitara) లెర్నింగ్ కిట్‌ను కేంద్ర మంత్రి ఆసక్తిగా పరిశీలించగా, దాని పనితీరును మంత్రి లోకేష్ స్వయంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్, అసెస్ మెంట్ బుక్ లెట్ మరియు 'సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్' (యూనిఫాం, స్కూల్ బ్యాగ్, బుక్స్, షూస్) నాణ్యతను కేంద్ర మంత్రికి చూపించారు. విలువల విద్యా బోధన కోసం ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలతో ముద్రించిన ప్రత్యేక పుస్తకాలను, ఆక్స్‌ఫర్డ్ బైలింగ్యువల్ డిక్షనరీలను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ విశదీకరించారు.

అనంతరం విద్యాశాఖ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'లీప్ డ్యాష్ బోర్డు' (LEAP Dashboard) పనితీరును కేంద్ర మంత్రికి ప్రదర్శించారు. ఈ డిజిటల్ స్క్రీన్‌పై విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్, రియల్ టైమ్ అటెండెన్స్, మధ్యాహ్న భోజన నాణ్యత, డ్రాప్ అవుట్స్ నివారణ, ఎంఈవో, డీఈవోల తనిఖీల వివరాలను ట్రాక్ చేసే విధానాన్ని లోకేష్ వివరించారు. ఇదే తరుణంలో ప్రభుత్వ పాఠశాలల్లో రాబోయే రోజుల్లో ప్రవేశపెట్టనున్న అధునాతన ‘స్మార్ట్ కిచెన్ల’ (Smart Kitchens) నమూనా ఏవీని మంత్రులు వీక్షించారు. కడప జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన స్మార్ట్ కిచెన్ విజయవంతమైందని కేంద్రమంత్రికి తెలిపారు.

Nara Lokesh: స్కిల్ ల్యాబ్‌లో పైథాన్ కోడింగ్ - విద్యార్థి సృజనాత్మకతకు ఫిదా

పాఠశాలలోని స్పోర్ట్స్ రూమ్, స్కిల్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రులు.. అక్కడ తొమ్మిదో తరగతి విద్యార్థి పైథాన్ లాంగ్వేజ్ (Python Language) ఉపయోగించి సొంతంగా డెవలప్ చేసిన 'హోం వర్క్ అండ్ పీరియాడికల్ అసెస్ మెంట్ అప్లికేషన్' సాఫ్ట్‌వేర్‌ను చూసి ఆశ్చర్యపోయారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఈ వయసులోనే కోడింగ్ రాయడంపై ధర్మేంద్ర ప్రధాన్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ప్రీ-వొకేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద ముద్రించిన 'కౌశల్ బోధ్' పుస్తకాలను పరిశీలించారు. పాల్ (PAL – Personalized Adaptive Learning) ల్యాబ్‌లో విద్యార్థులు వారి స్థాయికి అనుగుణంగా కంప్యూటర్ల ద్వారా నేర్చుకుంటున్న తీరును గమనించారు. ఈ సందర్భంగా స్కూల్ ఇన్నోవేషన్ హబ్‌లో విద్యార్థులు తమ సొంత చేతులతో త్రీడీ ప్రింటింగ్ (3D Printing) టెక్నాలజీ ద్వారా రూపొందించిన మంత్రుల పేర్ల నమూనాలను ధర్మేంద్ర ప్రధాన్, నారా లోకేష్‌లకు బహుమతిగా అందజేశారు.

చాణక్య అంటే కింగా?.. కింగ్ మేకరా?.. క్లాస్ రూమ్‌లో సందడి

మంత్రులు ఇద్దరూ పాఠశాలలోని 9వ తరగతి 'బీ' సెక్షన్ తరగతి గదిలోకి వెళ్లి నేరుగా విద్యార్థుల మధ్య బెంచీలపై కూర్చున్నారు. ఉపాధ్యాయురాలు భారత భౌగోళిక స్వరూపాలపై క్లిక్కర్ డివైజ్ (Clicker Video) ద్వారా డిజిటల్ బోధన చేస్తుండగా గమనించారు. అనంతరం ఫ్లిప్ ప్యానల్ ద్వారా నిర్వహించిన ఆన్‌లైన్ క్విజ్ పోటీలో 55 శాతం మంది విద్యార్థులు క్షణాల్లో సరైన సమాధానాలు చెప్పడాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించారు.

ఈ సందర్భంగా క్లాస్ రూమ్‌లో విద్యార్థులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి సరదాగా సంభాషించారు. మధ్యాహ్న భోజనం మెనూ గురించి ఆరా తీస్తూ.. ఒక విద్యార్థిని పేరు అడగ్గా 'చాణక్య' అని చెప్పాడు. దీంతో కేంద్రమంత్రి వెంటనే స్పందిస్తూ.. “చాణక్య అంటే ఎవరో తెలుసా?.. కింగా (Ruler)?.. కింగ్ మేకరా (Strategist)?” అని ప్రశ్నించగా.. ఆ విద్యార్థి ఏమాత్రం తడబడకుండా “కింగ్ మేకర్” అని సమాధానం ఇవ్వడంతో తరగతి గదిలో చప్పట్లు మారుమోగాయి. రాంప్రసాద్ అనే మరో విద్యార్థిని చదువులో అనుమానాలు వస్తే ఎవరిని అడుగుతావని ప్రశ్నించగా.. తన అన్నయ్యను అడుగుతానని, తనకు తెలుగు భాషలోనే చదవడం సౌకర్యంగా ఉందని చెప్పాడు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ.. గ్రామీణ విద్యార్థుల కోసం సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులను ఇంగ్లీష్‌తో పాటు తెలుగులో సమాంతరంగా ముద్రించిన బైలింగ్యువల్ (Bilingual Textbooks) పుస్తకాలను అందజేస్తున్నామని వివరించారు.

ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో ఐటీ, కోడింగ్, ల్యాబ్స్ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్‌ను అనుసంధానిస్తూ మంత్రి నారా లోకేష్ చూపిస్తున్న చొరవ, విజనరీ లీడర్‌షిప్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించి అభినందించారు.

ఈ ఉన్నత స్థాయి పర్యటన కార్యక్రమంలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ, ప్రవాసాంధ్రుల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ (SPD) బి.శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖాధికారి (DEO) మాణిక్యం పాల్గొన్నారు. అలాగే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, మార్క్‌ఫెడ్ రాష్ట్ర చైర్మన్ గిడుగు బంగారు రాజు మరియు నియోజకవర్గ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Epaper: epaper.vaartha.com

దేవాన్ష్‌తో క్రికెట్ ఆడటమే నా ఏకైక హాబీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha