YouTuber Nandana: సోషల్ మీడియాలో ఎంతో మంది ఫాలోవర్లను కలిగి ఉన్న యూట్యూబర్ నందనను హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు, ఆకర్షణీయమైన వీసాల పేరుతో అమాయక యువతను నమ్మించి భారీ మోసాలకు పాల్పడినట్లు ఆమెపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఆమెపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉండగా, ఆమె కోసం పోలీసులు గతంలోనే లుక్‌అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.

బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ సమయంలో పోలీసులకు చిక్కిన వైనం
పోలీసులు గాలిస్తున్న సమయంలోనే, ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చేందుకు నందన హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. షోలో పాల్గొనే నిమిత్తం నగరానికి వచ్చిన ఆమెను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, తనపై ఉన్న చట్టపరమైన లీగల్ అడ్డంకులు మరియు కేసులను తొలగించుకునేందుకు గాను ప్రముఖ న్యాయవాదులను సంప్రదించేందుకే ఆమె నగరంలోకి అడుగుపెట్టినట్లు మరోవైపు జోరుగా ప్రచారం జరుగుతోంది.

