Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీహార్ ప్రమాద బాధితులకు ప్రత్యేక విమానం:ఆనం

బీహార్ ప్రమాద బాధితులకు ప్రత్యేక విమానం:ఆనం

వార్త 5 days ago

Bihar Accident Nellore Pilgrims: బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన యాత్రికులు మృతి చెందడం తీవ్ర విషాదకరమని, బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

నెల్లూరు సంతపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన అత్యవసర పాత్రికేయుల సమావేశంలో మంత్రి ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు.

మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాలోని సంగం, ఆత్మకూరు, దుత్తలూరు ప్రాంతాలకు చెందిన 42 మంది భక్తులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక వంటమనిషితో కలిపి మొత్తం 45 మందితో కూడిన ప్రైవేట్ బస్సు ఈనెల 1వ తేదీన గయా-వారణాసి పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్ళింది. అయితే, ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో గయా నుంచి వారణాసికి వెళ్తుండగా బీహార్‌లోని ఔరంగాబాద్ సమీపంలో వేగంగా వచ్చిన ఒక లారీ వీరి బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మంది యాత్రికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో ఒక మహిళా భక్తురాలితో పాటు టూర్ అటెండెంట్, వంటమనిషి ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

Read also: Chandrababu Naidu: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి!

ముఖ్యమంత్రి ఆదేశంతో ప్రత్యేక విమానం..

ప్రమాద వార్త అందిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించి బాధితులకు అత్యవసర సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారని మంత్రి ఆనం తెలిపారు. గయా నుంచి నెల్లూరుకు రోడ్డు మార్గంలో రావడానికి సుమారు 38 గంటల సుదీర్ఘ సమయం పడుతుందన్న విషయాన్ని గమనించి, మృతదేహాల తరలింపునకు సీఎం ప్రత్యేక విమానాన్ని మంజూరు చేశారన్నారు.

ముగ్గురు మృతుల పార్థివ దేహాలను సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో గయా నుంచి నేరుగా తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయానికి తీసుకువచ్చేలా పక్కా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అక్కడి నుండి జిల్లా రెవెన్యూ అధికారుల ప్రత్యేక పర్యవేక్షణలో ఉచిత అంబులెన్స్ వాహనాల ద్వారా వారి స్వగ్రామాలకు తరలిస్తామని చెప్పారు.

క్షతగాత్రులకు చెన్నైలో మెరుగైన వైద్యం..

ప్రస్తుతం ప్రమాదంలో గాయపడిన 15 మంది యాత్రికులకు గయాలోని స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వీరిని కూడా ప్రత్యేక విమాన సదుపాయం ద్వారా గయా నుండి మొదట చెన్నై విమానాశ్రయానికి తీసుకువచ్చి.. అక్కడి నుండి ప్రత్యేక ఎసి బస్సులలో నెల్లూరులోని కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించి మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

తెలుగు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణ..

సహాయక చర్యల కోసం సీఎంవో (CMO) కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి బీహార్ ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నామని ఆనం వివరించారు. ఢిల్లీలోని ఆంధ్రభవన్ కమిషనర్ ఆధ్యా శ్రీకాంత్ నిరంతరం బీహార్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో సేవలందిస్తున్న సీనియర్ తెలుగు ఐఏఎస్ అధికారి డాక్టర్ రాజేందర్ కుమార్, ఐపీఎస్ అధికారి వివేక్‌లు స్వయంగా ఘటనా స్థలానికి మరియు ఆసుపత్రికి చేరుకుని స్థానిక యంత్రాంగంతో మాట్లాడి ఎప్పటికప్పుడు సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారని కొనియాడారు.

Bihar Accident Nellore Pilgrims: బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ: మంత్రి ఆనం

ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని సంగం, ఆత్మకూరు మరియు ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు గ్రామాల నుండి దైవదర్శనానికి వెళ్లిన భక్తులు ఇలా దూర ప్రాంతంలో ప్రమాదానికి గురికావడం తనను ఎంతగానో కలచివేసిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జరుపుతున్న పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగిసిన వెంటనే.. బాధిత కుటుంబాలకు అందజేసే ప్రభుత్వ ఎక్స్‌గ్రేషియా (ఆర్థిక పరిహారం) అంశంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని మంత్రి ఆనం ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

నామినేషన్లు దాఖలు చేసిన కూటమి రాజ్యసభ అభ్యర్థులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha