Rammohan Naidu: కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడే నైతిక హక్కు ఏమాత్రం వైసీపీకి లేదని ఆయన మండిపడ్డారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గోవిందరావుతో కలిసి ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఆయన వైఎస్సార్సీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

గత ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్ల అణచివేత: రామ్మోహన్ నాయుడు ఆరోపణలు
బీసీలకు రాజ్యాధికారం ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కకూడదనే కుట్రతోనే గత వైసిపి ప్రభుత్వం రిజర్వేషన్లను అడ్డుకుందని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బీసీ కోటాపై కోర్టు తీర్పు వెలువడినప్పటికీ, అప్పటి జగన్ ప్రభుత్వం దానిని కాపాడుకోవడానికి ఎందుకు పోరాడలేదని ఆయన సూటిగా నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో బీసీ వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Rammohan Naidu: సుప్రీంకోర్టులో కూటమి ప్రభుత్వ పోరాటం: టీడీపీదే బీసీల పక్షం
ప్రస్తుత ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను పక్కాగా అమలు చేసేందుకు సుప్రీంకోర్టులో గట్టిగా పోరాడుతోందని కేంద్రమంత్రి తెలిపారు. గతంలో తొలిసారిగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఆయన గుర్తుచేశారు. బీసీలు కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా సమాజంలో ఉన్నత స్థానాల్లో రాణించాలన్నదే టీడీపీ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.
టీడీపీ వెన్నెముక బీసీలే: జగన్ అండ్ కో ఆటలు ఇక చెల్లవు
తెలుగుదేశం పార్టీకి బీసీలే నిజమైన వెన్నెముక అని, టీడీపీ ఎప్పుడూ బీసీల సంక్షేమం కోసమే పనిచేసే పార్టీ అని రామ్మోహన్ నాయుడు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఇకపై మాజీ సీఎం జగన్ అండ్ కో ఆటలు సాగవని, ప్రజలంతా వారి మోసాలను గమనిస్తున్నారని హెచ్చరించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే వైసీపీ నేతలు విఫలయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
Epaper: epaper.vaartha.com

