Parvinder Awana: భారత మాజీ ఫాస్ట్ బౌలర్ పర్విందర్ అవానా బీసీసీఐ(BCCI) జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని శుక్రవారం భారత క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన అనంతరం అవానా పేరును ఈ పదవికి సిఫార్సు చేసింది.
కమిటీ సభ్యులు వీరే..
పర్విందర్ అవానాతో పాటు క్రిష్ణ దాస్, రాకేష్ పటేల్, ఎన్. అర్జున్ యాదవ్‌లను ఈ కమిటీలో సభ్యులుగా బీసీసీఐ నియమించింది. త్వరలోనే ఐదో సభ్యుడిని కూడా ఎంపిక చేయనున్నట్లు క్రికెట్ బోర్డు వెల్లడించింది. సిఏసి అభ్యర్థులను స్క్రీనింగ్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాతే ఈ పేర్లను ఖరారు చేసినట్లు ప్రకటనలో తెలిపారు.

పర్విందర్ అవానా కెరీర్ విశేషాలు
భారత్ తరఫున 2 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన అవానా.. 62 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 191 వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ తరఫున ఆడిన ఆయన ఇండియా-ఎ, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లకు ఆడటంతో పాటు ఐపీఎల్‌లో కింగ్స్ XI పంజాబ్‌కు కూడా ప్రాతినిథ్యం వహించాడు.
క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కోచింగ్ వైపు మళ్లిన అవానా.. ఢిల్లీ అండర్-16, అండర్-19, అండర్-23 జట్లకు శిక్షకుడిగా వ్యవహరించాడు. అలాగే బీసిసిఐ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) హై-పెర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్‌లలోనూ పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
కమిటీ ఇతర సభ్యులు బ్యాక్‌గ్రౌండ్
క్రిష్ణ దాస్: అస్సాం, గోవా జట్ల మాజీ ఫాస్ట్ బౌలర్ అయిన క్రిష్ణ దాస్, 49 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 166 వికెట్లు తీశాడు. ఇండియా అండర్-19, ఇండియా-ఎ జట్లకు ఆడిన అనుభవంతో పాటు ఉత్తరాఖండ్ రంజీ ట్రోఫీ జట్టుకు కోచ్‌గా సేవలు అందించాడు.
రాకేష్ పటేల్: గుజరాత్, బరోడా జట్లతో పాటు ఇండియా-ఎ తరఫున ఆడాడు. దులీప్, ఇరానీ ట్రోఫీల్లో ప్రాతినిధ్యం వహించాడు. బరోడా, గుజరాత్ అండర్-19, అండర్-23, సీనియర్ జట్లకు కోచ్‌గా పనిచేశాడు.
ఎన్. అర్జున్ యాదవ్: 83 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అర్జున్ యాదవ్, 2000లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. హైదరాబాద్ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయన, ఆ తర్వాత రాష్ట్ర సీనియర్, అండర్-23 జట్లకు కోచ్‌గా పనిచేసి, 2022 నుంచి బీసిసిఐ మ్యాచ్ రిఫరీగా సేవలు అందిస్తున్నాడు.
ఆసియా పారా క్రీడల్లో భారత్‌కు పతకాల పంట.. ప్రపంచ రికార్డులతో మెరిసిన అథ్లెట్లు!

