Bank Strike : ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపునిచ్చిన మూడు రోజుల దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (Public Sector Banks) కస్టమర్లకు ఇబ్బందులు కలగకుండా కీలక నిర్ణయం తీసుకున్నాయి.
సమ్మె సమయంలో బ్యాంక్ శాఖల సేవలు నిలిచిపోయే అవకాశం ఉండటంతో, ఖాతాదారులకు నగదు కొరత రాకుండా చూసేందుకు ఏటీఎంల వినియోగంపై ఉన్న పరిమితులను సడలించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చూపిన బాటలోనే మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఈ మూడు రోజుల పాటు ఏటీఎంలలో పరిమితికి మించిన లావాదేవీలపై వేసే రుసుములను పూర్తిస్థాయిలో రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.

ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా ఉచిత నగదు ఉపసంహరణ
సాధారణంగా నిర్ణీత ఉచిత పరిమితి (Free Limits) దాటిన తర్వాత కస్టమర్లు చేసే ప్రతి ఏటీఎం లావాదేవీపై రూ. 10 నుంచి గరిష్ఠంగా రూ. 23 వరకు (జీఎస్టీ అదనం) ఛార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ సమ్మె కాలంలో వినియోగదారులు తమ స్వంత బ్యాంకు ఏటీఎం కాకుండా ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎంలను వినియోగించుకున్నప్పటికీ ఎటువంటి అదనపు ఛార్జీలు పడవు. బ్యాంకింగ్ సేవలకు భంగం వాటిల్లే ఈ మూడు రోజుల్లో ప్రజలు ఏ ఏటీఎం నుంచైనా ఎలాంటి ఆందోళన లేకుండా నగదు డ్రా చేసుకునే వెసులుబాటు లభించడంతో ఖాతాదారులకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది.

