KTR : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీకి సంబంధించిన వివాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నదీ జలాల హక్కుల పరిరక్షణలో ప్రస్తుత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వ్యవహరిస్తూ తెలంగాణ నీటి ప్రయోజనాలను సీఎం రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతున్నారని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. గురుదక్షిణ చెల్లించే నెపంతో గోదావరి జలాలను ఏపీకి సంతర్పణ చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (GRMB/KRMB) సమావేశాల్లో తెలంగాణ హక్కుల గురించి మాట్లాడకుండా, దొంగ సమావేశాలు నిర్వహిస్తూ కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

సలహాదారుల నియామకంపై కేటీఆర్ వ్యాఖ్యలు
తెలంగాణ ఉద్యమ సమయంలో నీటి పారుదల రంగానికి దిశానిర్దేశం చేసిన తెలంగాణ బిడ్డ, నీటిపారుదల నిపుణులు విద్యాసాగర్ రావును తమ ప్రభుత్వ హయాంలో సలహాదారుగా నియమించుకున్నామని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ సీఎం మోచేతి నీళ్లు తాగే ఆదిత్యనాథ్ దాస్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమించుకుందని ఆరోపించారు. తెలంగాణ స్వయంప్రతిపత్తిని, నదీ జలాల వాటాను పరిరక్షించడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా వెనుకంజ వేసిందని కేటీఆర్ స్పష్టం చేశారు.

